Friday 14 May 2021

                                 ఎవరికెవరో...



తెగదు తెల్లారదు... ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి
గుర్తు తెలియనంతగా కూరుకుపోవడం తప్ప
ప్రాణాల్ని ఉగ్గబట్టి బొటనేలు మీద నిలపడం తప్ప
అగమ్య అంతఃసమీరాలలోతుల్లో నిర్హేతుకంగా ఉరితీయడం తప్ప
ప్రపంచ యవనికపై హృదయాన్ని నగ్నంగా ఆరబెట్టుకోవడం తప్ప
నిప్పులవాన కౌగిలిలో మంచుతో మార్మికంగా దహించకపోవడం తప్ప
లోపలకు బయటకు ప్రయాణించలేని ఉరిశిక్ష తప్ప
తెగదు తెల్లారదు... ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి
గతాను గతికంగా ప్రవహంలో హాయిగా కొట్టుకుపోవడం తప్ప
రెండు చంద్ర గోళాల మధ్య ధారగా కురుస్తున్న యవ్వనం తప్ప
అక్షర కుంజర జగత్తులో స్వాప్నిక బిందువులుగా మారడం తప్ప
బైరాగి జోలిలోని నాలుగు బియ్యపు గింజల వాసన తప్ప
బిక్కమొహం వేసుకున్న వాకిళ్లలో కంపు కొడుతున్నచూపులు తప్ప
ఆవేదనకు, నిజాయితీకి మధ్య రుచి చూడని తపస్సు తప్ప
తెగదు తెల్లారదు... ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి
నటనానుకూల స్వాభావిక సంచలనాలు తప్ప
గుండెల బరువెక్కే కన్నీటి సెగల జీవరాసుల తప్ప
పరిమళ భరిత ప్రకృతి క్షోభాయమాన శకలాలు తప్ప
జోడించడం, తొలగించడం, ఫార్వర్డ్ లలో క్రియేషన్ తప్ప
నన్ను నేను పిడికె‌‌డు యంత్రంలో పూర్తిగా పారేసుకోవడం తప్ప
బతికిీ బతకని క్షణాల మధ్య నాకు నేనే ఉలిగా మారడం తప్ప
తెగదు తెల్లారదు... ఎంతసేపో అడుగంటని ఆలోచనల జడి

Saturday 6 August 2016

మీరు... మీ ఇష్టం

 
                                                
మీరు... మీ ఇష్టాలు. కొత్తగా పరిచయం అయిన ప్రతి ఒక్కరూ మరొకరి గురించి మొదట తెలుసుకునేది వీటి గురించే. స్నేహం చేయాలన్నా, ఏర్పడిన స్నేహాన్ని పెంచుకోవాలన్నా, ప్రేమించాలన్నా, ప్రేమను నిలబెట్టుకోవాలన్నా ఇద్దరి మనుషుల మధ్య వీటి గురించే చర్చ. ఇక యూత్ లో అయితే... చెప్పాల్సిన పనే లేదు. రస్కిన్ బాండ్ అని ప్రఖ్యాత రచయిత అంటాడు- ప్రతి మనిషికి 18 ఏళ్లు వచ్చేసరికి సొంత ఇష్టాలు ఏర్పడతాయంటాడు. ప్రతిభను గుర్తించే స్థాయి కూడా ఏర్పడుతుందట. ఇద్దరూ ఫ్రెండ్స్ హోటల్ కు వెళ్లినా, ఓ గ్రూప్ పార్టీ చేసుకున్నా... నాకు ఇది నచ్చదు. నాకు వేరే కావాలి. ఆ డ్రెస్ బాగా లేదు. నాకు ఈ కలర్ నచ్చుతుంది. ఇలాంటివి ఎన్నో మీ మధ్య వినిపిస్తుంటాయి. ఇష్టం అంటే కేవలం రంగులు, పువ్వులు, తాగే, తినే పదార్థాలే కాదు. మీ జీవితాన్ని నిర్దేశించే అభిప్రాయాలు. మీ లక్ష్యాలను ఏర్పరచే మానసిక స్థితులు. మిమ్మల్ని మరో మనసుకు, మనిషికి దగ్గర చేసే మానవీయ దృశ్యాలు.  అసలు ఇష్టాలు ఎలా ఏర్పడతాయి. మీ ఇష్టాలు పూర్తిగా మీవేనా... లేక మీపైనా ఎవరైనా రుద్దారా.. ఇష్టాలు మరతాయా... లేక అవసరాన్ని బట్టి మార్చుకుంటారా... ఆలోచిస్తేనే అదోలా ఉంటుంది.
 
మీ ఇష్టాలే... మీ ప్రపంచం
        ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొన్ని అయిష్టాలు ఉఁటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, చిన్నప్పటి స్నేహితుల నుంచి, సామాజిక, ఆర్థిక పరిస్థితుల నుంచి ఏర్పడుతాయి. ఇద్దరు లవర్స్ విడిపోయారు. కారణం కనుక్కుంటే... ఆ అమ్మాయివి విపరీతమైన కోర్కెలు, లవర్ అవి తీర్చలేక పోతున్నాడు. అందుకే, బ్రేకప్ అయ్యారు అని తెలిసింది. ఆ అమ్మాయి మాత్రం- నేను లేని కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పడు సిటీలో తోటి ఫ్రెండ్స్ ను చూస్తుంటే వారిలా ఉండాలని, డ్రెస్ చేసుకోవాలని, సినిమాలు, పార్టీలకు వెళ్లాలని... అనిపిస్తుంది. ఇప్పుడు నా ఇష్టాలలో మార్పులు వచ్చాయి అంది. అవును చుట్టూ ఉన్న వాతావరణం మారే సరికి ఇష్టాలు మారాయి.
          మీ ఇష్టాలు ఉన్న వాళ్లే మీకు స్నేహితులుగా వస్తారు అని అంటారు మానసిక శాస్త్రవేత్తలు. మీ ఇష్టాలు నచ్చని వారితో ఎక్కవ రోజులు ఫ్రెండ్ షిప్ చేయలేరు కదా మరి. మీరు ఏ దృష్టితో లోకాన్ని చూస్తే అదే దృష్టితో లోకం మీకు కనిపిస్తుందట. అంటే ఇష్టాలు అనేవి సమాజంలోనుంచి పుట్టి, సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. మీ చుట్టూ ఉన్న సమాజం మారినప్పుడల్లా ఇష్టాలు మారే అవకాశం ఉంది. కానీ కొన్ని మారని ఇష్టాలు కూడా ఉంటాయి. అలానే మార్చుకోలేని ఇష్టాలూ ఉంటాయి. అందరికీ కామన్ ఇష్టాలు ఉంటాయి.  
 
మీ ఇష్టమే మీ లక్ష్యం అవ్వాలి
          చిన్నప్పుడు స్కూల్లో మాస్టారు అడుగుతాడు- నీకు ఏమవ్వాలని ఉంది అని. ఒకడు డాక్టరు అంటాడు. మరొకడు ఇంజినీరు అంటాడు. ఇంకొకడు నటుడు అంటాడు. కానీ తెలిసీ తెలియని వయసులో మనలోంచి వచ్చిన ఆ ఇష్టాలు బలపడొచ్చు, బలపడకపోవచ్చు. కానీ మీరు పెరిగే కొద్ది వయసుతో పాటు, మీ మానసిక పరివర్తనతో పాటు మీ ఇష్టాలూ మారతాయి. కానీ మీరు మీ లక్ష్యాన్ని మాత్రం మీ ఇష్ట ప్రకారంగా ఏర్పరచుకోవాలి. మీ నాన్న చెప్పాడని, మీ అమ్మ చెప్పిందని, మీ గురువు చెప్పాడని... ఇంజినీరవ్వొద్దు, కొత్త కంపెనీలో చేరొద్దు. మీకు నచ్చకపోయినా అ అబ్బాయి వెంట తిరగొద్దు. బలవంతంగా మీ ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. అలా ప్రవర్తిస్తే సర్దుకుపోయే మనస్తత్వం అలవడుతుంది. కొంత కాలానికి మీకు మీరే మిగలరు. అయిష్టత స్థాయి పెరిగి ఓ యంత్రంలా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
           ప్రతి పనిని మీ ఇష్ట ప్రకారం చేయడానికి ప్రయత్నించండి. తప్పనిసరై వేరే రంగంలో అడుగు పెట్టినా దాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. ఇష్టంతో చేసే పనిలో ఉండే మజాని అనుభవించండి.  మీ ఇష్టాన్ని బట్టి వేరే ఆల్టర్ నేటివ్ చూసుకోండి. తప్పనిసరైతేనే మిగిలిన వాటిని స్వీకరించండి. మీ కిష్టమైన పనిని పూర్తిచేసినప్పుడు, మీకు ఇష్టమైన అమ్మాయి, లేదా అబ్బాయి ప్రేమను పొందినప్పుడు కలిగే ఆనందం ముందు ఈ ప్రపంచంలో ఏదీ సాటిరాదు. ఓ ప్రముఖ రచయిత అంటాడు- తప్పించుకోలేని స్థితిలో తప్పు చెయ్యాల్సి వస్తే... దాన్ని ఇష్టంతో చెయ్యి. అప్పుడే దాని ఫలితాలు చెడుగా వచ్చినా ఆనందంగా అనుభవిస్తావ్ అంటాడు.
 
భాధను తీర్చే నేస్తాలు
         ఇష్టాలు మన నేస్తాలు. జీవితాంతం మనతో ఉండే ఆత్మీయులు. బాధ కలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఉపశమనం కోసం మీ ఇష్టాలను పిలవండి. వాటితో గడపండి. భవ్యాకు చంద్రుడ్ని చూడ్డం అంటే ఇష్టం. మనసు బాగా లేనప్పుడు చంద్రుడ్ని చూస్తూ కూర్చొంటుంది. ఆ చల్లటి వెన్నలను ఆశ్వాదిస్తుంది. ఆ తెల్లటి కిరణాల్లోంచి వచ్చే వెలుగే తన మనసును ఊరడిస్తుందని చెప్తుంది. అలానే కిరణ్ కు పెయింటిగ్స్ వేయడమంటే చాలా ఇష్టం. మనసు కుదురుగా లేకపోతే వెంటనే గదిలోకి వెళ్లి తన భావాలను ఓ పెయింటింగ్ గా మార్చేస్తాడు. అంతే కూల్ అయిపోతాడు. కొందరు మొక్కలు పెంచుతారు. కొందరు అమ్మఒడిలో వదిగిపోతారు. మరికొందరు ఎక్కువగా చదువుతారు. మరికొందరు బాధలోంచే కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. అంటే కొత్త ఇష్టాన్ని నిర్మించుకుంటారన్నమాట. ఇలా మీ ఇష్టాలకు మించి మిమ్మల్ని ఊరడించేవారు లేరంటే అతిశయోక్తి కాదు.
             కొందరు లవ్ ఫెయిలయ్యిందని, మార్కులు తక్కువ వచ్చాయని లేదా తన లవర్ ఇంకోవాడితో తిరుగుతుందని, కొత్తగా పెళ్లయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా లేవని మద్యానికి బానిసలవుతుంటారు. దాంతో ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. కరెక్ట్ కాదు. మీ ఇష్టాలు మీకు తోడుంటాయి. మీ మనసును స్వచ్ఛంగా చేస్తాయి. బాధలో మీ కన్నీటిని తుడిచేవి అవే. మరో మనిషికి దగ్గర చేసేవి అవే. అందుకే మీరు మీ ఇష్టాలతో స్నేహం చేయండి.
 
ఇష్టంతో జీవిద్దాం
        ఓ ప్రేమికుడు రాసిన లేఖలో- నీకోసం మళ్లీ పుట్టడానికి వెేలసార్లైనా మళ్లీ మళ్లీ పుడతాను. ఈ కవితా వాక్యంలో ఆ ప్రేమికుడిలో ఆ అమ్మాయి మీద ఎంత ఇష్టం ఉందో తెలుస్తుంది. చాలామంది- నేనింతే... నా ఇష్టం... నే నిలానే ఉంటాను అంటుంటారు. కానీ మీ ఇష్టాలు మరొకర్ని ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. మిమ్మల్ని ఇష్టపడే వారికోసం మీ ఇష్టాల్ని మార్చుకోవడం కూడా ఇష్టమేనట. అలా అని మీ అస్తిత్వాన్ని కోల్పేయే అంతగా మీరు మారిపోకూడదు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఇష్టంతో జీవించాలి. జీవించడంలోని తృప్తిని ఆనందంగా అనుభవించాలి. నెలకు ఒకసారైనా మీరు మీ ఇష్టాల్ని, మీరు ఆత్మీయంగా అనుభవించిన మధుర క్షణాల్ని గుర్తుచేసుకోవాలి. వీలైతే రాసి పెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడు చదువుకుంటుంటే... రీ ఛార్జ్ అవుతారు. జీవితాన్ని మరింత ఇష్టంత అనుభవిస్తారు.    

Thursday 16 June 2016

 
      
 
 
                   నాన్న క్షమించకు...!
                       
  నాన్నా...!
  ఈ సృష్టి జీవన పాఠశాలలో తొలి బిందువు నువ్వు
  నీ భుజాల భరోసాలో నే నిటారుగా నిల్చున్న బాల్యాన్ని
 
నీ పొట్టపై నా కేరింతలు అల్లరిలో నీ కోపాల తీయదనం   నా అడుగుల తచ్చాటల్లో తొలి ఊతానివి నువ్వు
  నీ చిటికినేలు చుక్కానితో  మొదలైంది నా బ్రతుకు నడక
  సాయంత్రాలు ఇంటికి నీవస్తుంటే నోరూరిన జ్ఞాపకం నాది
  నాన్నా...!
  నా ఎల్ కె జీ చదువులు నీ సంపాదనల మెట్లను ఇక్కట్లు చేశాయి
  నే తరగతి మారినప్పుడల్లా నీ ఆర్థిక ఒత్తిడి అప్పులపాలయ్యేది
  నా ర్యాంకుల్లో నీ కష్టాలు ఆర్ద్రంగా గొప్పులు పోయేవి
  కానీ.., ఏ అర్ధరాత్రో అమ్మతో మాటల మధ్య మౌనంగా రోదించేవి
  నా ఉద్యోగం కోసం నీ కళ్లు, జేబు ఆర్తిగా జాలువారాయి
  అసలు, నా ప్రతి విజయంలో నీ శక్తి సన్నగిళ్లిన క్షణాలు ఎన్నో...
  నాన్నా...!
  నా నమ్మకానికి పునాది రాయివి నువ్వు
  నా వెలుగుల మధ్య చీకటి ప్రభవు నువ్వు
  నా విలాసాల తాలూకూ పేదరికం నువ్వు
  నా రేపటి వర్తమానానికి కొడుకువు నువ్వు
  అసలు, నాకు నేను మిగలనప్పుడు ఉండేది నువ్వే...
  నాన్నా...!
  వృద్ధాశ్రమాల ఆలనలో నువ్వు పొగిలిపొగిలి కుములుతుంటే...
  ఓ ముసలి చేయి ఆకలితో నా ముందు ఆక్రందనతో ఊగుతుంటే...
  మూడుకాళ్లతో ఏ అడ్రెస్ లేని రోడ్డుపైనో నీవు స్పృహతప్పితే...
  దూరంగా వినోదాల విందుల్లో, ధనాంధులమై నిన్ను వదిలేస్తుంటే...
  నాన్నా...!
  నీ చిరునామాను... ఎక్కడని వెతకను..!?
  రైలు పట్టాలా పైనా... తీరం తాకే అలల కడలిలోనా..
  ఉరికి వేళాడే అస్తిపంజరాల్లోనా... ప్రాణాలు తీసే మందుల్లోనా..
  అసలు... మృగ్యమైన కొడుకుల మానవత్వంలోనా...
               క్షమించకు నాన్నా... క్షమించకు...
               నాన్నను చూడని ఈ నాన్నలను...

Thursday 7 May 2015

                         ఎడతెగని బంధం...


బాధకు బంధానికి ఏదో ఎడతెగని సంబంధం ఉంది.
చీకటి మాటున పొంచి ఉన్న చిరుతపులిలా నీ జ్ఞపకాలు గుచ్చుతున్న వేళ.
కలనో, అలనో, నాకు నేనే లేనో  ఏమో... యుక్త వయసులో వార్థక్యం మనసు.
ఇన్ని అనుభవాలను గుండెపై మోస్తు... ఓ నిర్లక్ష్యపు క్షణాన నీకై కన్నీటిని మింగుతూ... ఇలానే.... అలానే... ఎప్పటికీ...
కవిత్వానికి, మనసుకు ఏదో తీయని అనుబంధం ఉండి ఉండాలి.
అందుకే ఈ అక్షరాలు వెన్నెల్లో ముంచిన చీకటిని నవ్వుల్లా పంచుతాయ్.
తప్పును కూడా ఇష్టంతో చేయమన్న మనసును మెచ్చిన సన్నివేశాలు.
ఊహాలు, వాంఛలు, ఆశలు, కోరికలు కలగలిసిన ఓ ఆత్మీయ స్పర్శ పొందిన అనురాగం. బంధాలు కూడా బద్దలు కొట్టగలదన్న కసి కాలానికి నిదర్శనం.
ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా నిర్దయగా చీలుతున్న గుండె గొడలు.
వద్దన్నా, కాదన్నా, నీ పుటలు రాలుతున్న కన్నీటి జడులు.
అసలు ప్రేమకు, స్నేహానికి ఇన్ని నిర్వచనాలు అనవసరం. ఒక్క నీ స్పర్శ చాలు.
నీ కుంతలాల మధ్య నే పొందిన వెచ్చని జ్ఞానం చాలు.
కానీ ఇప్పుడు ఆనందం...సుఖం, సంతోషాన్ని... బిక్షా పాత్ర పట్టుకొని వెతుక్కుంటున్నా...
ఎన్ని ఎడారుల మధ్య నిర్దయగా రాలుతున్నానో...
ఎన్ని రాత్రులను హృదయంమీద సంక్షీప్తీకరిస్తున్నానో..
పులుపులు,,, మలుపులు... ఆసక్తులు...
అన్ని ఎగిరి పోయి...
ఇలా... ఇలా... ఇలా...
కాలానికి... నాకు ఎప్పుడూ పోరే...
దానిని నేను పట్టించుకోదు... నన్ను అది పట్టించుకోదు...
కానీ ఇప్పుడు మాత్రం అది చెప్పినట్లు నేను నడుస్తున్నానా...
కానీ అలా క్కూడా... వేదిస్తుంది... బాధిస్తుంది... వ్యతల్ని ఎక్కువ చేస్తుంది.
ముంగిపు లేని బాధల్తో... మదింపులేని మోహంలో...
నిన్న... నేడు... రేపు.. ఎప్పటికీ...

Monday 27 April 2015

    

                                          

     శైకతశైలి (కవిత)

1.
ఏం రాయను..?
అనంత కాంతి సంవత్సరాల తర్వాత...
నాలో నిన్ను వెతికి పట్టుకోవాలని...!!
దూరాన్ని దగ్గరగా శపించుకొని
నేను గుర్తున్నానా...?
అని నా అంతరంగపు విరహాన్ని అడిగితే ఏం చెప్పను...?
చలన సూత్రాల నిండా బహుముఖ స్వాప్నిక జగత్తును గుండెకెత్తుకొని
నీకై... నీదై... రోదిస్తున్నా... ఏం చెప్పను...?
నీవు లేని క్షణాల్లో ఎదలో రగిలిన కణాల జ్వాలాక్షరాలను
ఎలా రాయను?
అన్వేషణ ఆఖరి పుట తిరగేస్తూ...
ఒక్క ఓదార్పు భాష్పజలమై నిరాశగా జారుతుంటే
ప్రియా... గుర్తున్నానా అంటే ఏం రాయను...!?
నాలో నిన్ను...!!
2.
పరిణామ గతులలో...! శిశువు కేకలో...!!

చీకటి విచ్చిన కాంతుల్లో...!!!
వివర్ణాలైన నా హృదయ శబ్దంలో..!!
ఏ తాత్వికతా ఇవ్వలేని నిర్వచనంగా వెతికిన ప్రతిసారీ
భాష లేదు...? భావం లేదు...? భ్రాంతి లేదు...?
అంతా ఒక్కొక్క మరణ శ్వాస క్షణాలు.
ఆనందానికి, అనుభవానికి మధ్య కూలిన వంతెనపై కూర్చొన్న
ఏకాకి హృదయంతో వెదుకులాట...! "వెత"కులాట...!!
అనం సృష్టి చలనాల్లో....!
అది భౌతిక నిగూఢ స్పర్శల్లో...!!
నీ పాద మృదు రజానికై...!!!
గుర్తులకై... వెదుకులాట...
సాహిత్యాన్ని, సౌందర్యాన్నీ పెకలిస్తూ రాలుతున్న హృదపూల ఘోష
విభజన లేని కణం చుట్టూ నువ్వూ, నేను.  నేను నేనే.
ఆ క్షణాల అంతా ఫెటిళ్లమనే చీకటి...!!
అవే కదా నువ్వూ నేను కలిసిన చివరి, మొదటి క్షణాలు.
3.
అప్పటి నుండి వెదుకులాట!
నాలోకి నేను, సృష్టిలోకి నేను
కళల్లోకి సాహిత్య, సౌందర్య పిపాసినై నేను.!!
నీకై... కై... మారుతున్న జాగాలలో మనసు పారేసుకుంటూ
చరిత్ర బీజాలకు మన పంచేద్రియాలకు ప్రాణంగా పోస్తూ...!
బతికిస్తూ నేను... నీవు అయిన నేను.
నీవు కాని నేను...!!
4.
అంతా శబ్ద చలనం...
అంతా నిర్మితం...
అంతా కుత్రిమం...
అంతా నీవు కాలేక పోతున్న నేను...!
భాషించలేని భాష సాక్ష్యం.!
ఎదకు ఎదకు ఎడారంత దాహం!
శరీరానికి ఎదకు సముద్రమంత వేడి నీవైన నాకు...,
సాక్ష్యాలు లేని బతుకుల్లో...!
ఎలా ఉన్నావు...?
నీవు లేని నే... అలవాటైపోయాను.!
పోతూనే ఉన్నాను...!!
నా గుండె వేలు పట్టుకొని, కళ్లకు గంతలు కట్టి
ఎవరో బలవంతంగా ప్రేమగా లాక్కెళ్లి పోతున్నారు..!?
5.
నీ జాడల్లేవు...  నీ పాటల్లేవు...
షెహనాయ్ మూగబోయింది.
కవాటాలు మూసేసుకుని నాలోకి నేను నీవుగా కుదించేసుకుంటున్నా
ప్రవాసంలోకి పోతున్నా...!!
అయినా...!
 నీ కోసం జన్మజన్మలకు నాలోనేను తవ్వకాలు జరుపుతూనే ఉన్నా
ఉన్నా...! ఉంటున్నా...! ఉంటూనే ఉన్నా...!!
అందుకే ...!
నేనిప్పుడు నీకై కవిత్వంగా చెక్కుకుంటున్న శైకత శిల్పిని.
ఇలా... లా... లా... ఇలానే....!?

Tuesday 2 September 2014

అలల కల్లోలాల మధ్య


నీ జ్ఞాపకాల పూలల్లోంచి ఒడ్డున పడక చాలా కాలమైంది. నీ కురుల ఆకాశంలో నక్షత్రాల వెలుగుల్ని ఆశ్వాదించక చాలా రోజులైంది. నీ నడకల హొయలలో నేను అనుభూతి చెందక చాలా క్షణాలు వెళ్లిపోయాయి. నీ లే నడుమొంపుల్లో సేదతీరక యుగాలు గడిచిన జ్ఞాపకం. ఇంతకీ ఎలా ఉన్నావు నా హృదయ జలపాతమా... నా అనుభవాల ఎడారి ఒయాసిస్సా. కాలం మారింది. మనుషులు మారారు. మానవత మారింది. సున్నితత్వం, శాశ్వతమైన ఆనందం కనుమరుగయ్యాయి. కనులు పొడుచుకున్నా ఒక్క లేత ప్రేమ కిరణం పొద్దుపొడవటం లేదు. ఆకాశ హర్మ్యాలలో కత్తుల మనసులు నాట్యాలు చేస్తున్నాయి. కోర్కెల ఆశల్లో మనిషి ధనం చుట్టూ ప్రహరా కాస్తూ ప్రేమని భ్రమించి చస్తున్నాడు
 
        ఎన్ని చెప్పేది నా హృదయ నేత్రమా... నీకేం నీ యాత్ర ముగించుకొని ఆనందంగా వెళ్లి పోయావు. నీ పుటల్లో అక్షరాన్నైనేను నా ప్రేమ పాత్ర పట్టుకొని ఇక్కడ నీతి, నిజాయితి, విలువలు, స్వచ్ఛత కోసం భిక్షమెత్తుకుంటున్నాను. అయినా వాటిలో నాలుగు పరిమళపు మాటలు కూడా రాలడం లేదు. అసలు బతుక్కు అర్థం ఆనందం అని, అది మనస్పూర్తిగా ప్రేమించే మరో మనసులోనే దొరుకుతుందని ఈ వ్యాపార సామ్రాజ్య మనుషులకు తెలియడం లేదు. చెప్తే నన్నే ఓ పిచ్చి వాడిగా చూస్తున్నారు. నీ కోసం భిక్షమెత్తుతుంటానా..., అకారణంగా నయనాలు జలపాతాలవుతాయి. ఎక్కడన్నా నీ రుజువుల్లో లేతగుండెల్ని ప్రేమతో నింపాలని ఎదురు చేసే పరువపు పిల్లలు ఎదురవుతారా.. ఏముందిక ఏ కర్కశ హృదయమో వాటిని బలి చేసి ఉంటుంది. పాపం వాళ్లని చిరుపాపల్లా ఎత్తుకొని లాలించాలి, బుజ్జగించాలి, అనిపిస్తుంది. వారి హృదయాలు అంత పునీతమైనవి, చిగురాంకురమైనవి. బరించలేనంత ప్రేమ పుష్పాలతో వాళ్లని తడపాలనిపిస్తుంది. ఎందుకంటే నీవు ఇచ్చిన స్నేహంలో నేతడిసిన రేకుల వాసనలు నాలో చెరగని చిహ్నాలు కదా...

            కాని నిజం చెప్పనా... అలాంటి వాళ్లకి, ఆ లోగిలి నాచు బావుల గుండెలు ఇష్టమంటారు. వాటిలోనే కొలువై ఉంటామంటారు. బయటకు రమ్మన్నామా... వారికి మనసు లేదుకాబట్టి. నా శరీరం కూడా అర్పించామని చెప్పేస్తారు. కానీ ప్రేమలేని శరీరం... ఆలోచనే భరించలేనని నీకు మాత్రమే తెలుసు కదూ... ఎంతమంది కుటుంబం, భర్త, పిల్లలు, తప్పు చేశాను, ఆస్తి, ధనం, సమాజపు విలువలు, దేవుడు, కోర్కెలు, మతం... ఎన్ని పేర్లో పెట్టుకొని ప్రేమలేని మనసుల్లోంచి శరీరానికి సుఖాన్ని ఇస్తున్నారో ఈ లోకంలో. బాధేస్తుంది. మళ్లీ దానికి ప్రేమని నీ స్వచ్ఛమైన పేరును పెట్టుకుంటారు. ఆ వలయాలు, కచ్చడాలు దాటాలంటే భయం.  ఒకవేళ దాటినా బయట ఉండలేరు. అసలు రాలేరు. సమాజాన్ని ఎదిరించే ధైర్యం నేటికీ చాలామందికి రాలేదు. మరి సమాజం అభివృద్ధి చెందింది అంటే నాకు నవ్వు వస్తుంది. మనసులు ఎదగకుండా సుఖాలను ధనంలో కొనుక్కుంటే అభివృద్దా... మన క్షణాలను, మన మనో భావాలను ధనంతో, అదిచ్చే సుఖంలో కొనుక్కుంటే సరిపోతుందా...
 
          సుఖం వేరు, ఆనందం వేరు కదా... నువ్వే ఎన్ని సార్లు నీ చిరుకవితల జలతారులోంచి వినిపించావ్ నా మనసును. ఆ ఆనందంకై మనషులు ప్రయత్నించరు. ఒకవేళ ఎవరైనా పురుషుడు, స్త్రీ..., ఇద్దామన్నా, లక్షల అనుమానాలు. ఎందుకంటే వీళ్లకి కపట నాటకాలు, దొంగప్రేమలు అలవాటై పోయాయి. సరే... ఈ ప్రేమ గొడవెందుకు గానీ... నా అరుపుల అక్షరాలతో లోకం తీరు మారుతుందా... ఏ టీనేజ్ అమ్మాయన్నా... అబ్బాయన్నా... ఆలోచనల లోచనాలతో మనల్ని గమనిస్తాడా... ఈ ఆకృతుల్లో... మారని లోకంలా మారని నేను ఎప్పటిలాగే ఓ సుధీర్ఘ నరకాన్ని అనుభవిస్తున్నాను. వంద ప్రతిబంధకాల మధ్య... రోజూ నల్లటి చీకటి వలయాల మధ్య ఉరులు తీసుకుంటూనే ఉన్నాను. ఆశలేదు, నిరాశ లేదు. నిశీథి విలయం లేదు, ప్రళయం లేదు. ఈ మధ్య అసలు బ్రతకడం ఎందుకు అనే ప్రశ్న బాగా వేదిస్తుంది. గుప్పెడు గుండెను తట్టే ప్రేమ కోసం బతకాలని... నీవు చెప్పిన జవాబు. ఎప్పటికీ వెలిగించని దీపంలా నాలో నిదురిస్తుంది. నాలోకి నేను ఇంకా పరకాయ ప్రవేశం చేయలేక పోతున్నాను. సమాజంలోని మనషులతో రాజీపడలేక నాలుగు ఆలోచనల రోడ్ల కూడలిలో సర్రియలిజాన్నై మూర్ఛనలు పోతున్నాను. పోతూనే ఉన్నాను... నా మనసుకు ఇక సూర్యోదయం లేదని తెలుస్తూనే ఉంది. బహుశా అదీ కష్టమేమో.. గుండె యవనికపై ఎవరి చిత్రమూ ముద్రించ లేదు. అందుకే నీ మాటను ఇంకా వాస్తవ చిత్రంగా గీయలేదు. క్షమించు.
                 
                                                                           ఇప్పటి కింతే.
                                                                             సె(లవ్)