Saturday 26 July 2014

ప్రేమ చిననుకుల జ్ఞాపకం

                                                 
ధారాపాతంగా వర్షం కురుస్తుందిరా...! ఆకాశం నుంచి అప్సరసలెవరో పూలు కురిపిస్తున్నట్లు...! వానాకాలం నాటి సాయంత్రాలు...! ఎన్ని అనుభూతుల్ని మిగిల్చాయో నీ నుంచి నాకు...! సన్నటి తువర మధ్య వెచ్చటి నీ శరీరపు వాసనతో రోడ్ పై నడుస్తుంటే...! ఎంతమంది విచిత్రంగా చూసే వాళ్లో...?! వీరిద్దర్ని వర్షం తడుపుతుంది కదా...? ఎందుకు పట్టించుకోవడం లేదు అని. అయినా.., వర్షం అంటే నీకు అంత ఇష్టం ఎందుకో, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ప్రకృతిలోని అందమైన దృశ్యాలన్నీ పూర్వజన్మవల్ల నీలో అనుభూతులుగా మిగిలాయోమో...! తెల్లటి నీ శరీరం ఎర్రటి చుడీదార్ లో తడిస్తే...! పక్కనున్న నాలో కవిత్వం ముక్కలై పూస్తుంటే...! నువ్వు ఎంత బలవంతం చేసే దానివి కవిత్వం చెప్పొద్దు, చెప్పొద్దు అని, అయినా ప్రవాహం ఆగకపోతే చివరకు 'నీ కవిత్వమే నేనైనప్పుడు నీకు ప్రత్యేకంగా కవిత్వం ఎందుకురా?' అని గోముగా తిట్టేదానివి. దాంతో మౌనంగా నిన్ను, వర్షాన్ని, వర్షంలో నిన్ను చూస్తూ అలా ఉండిపోయేవాడ్ని.
  
      నీకు గుర్తుందా...? ఒకరోజు రోడ్ పై వర్షంలో ఇద్దరం నడుస్తువ్నాం. వర్షం విపరీతంగా పెరిగింది. గానుగ చెట్టుకింద ఒదిగి నిలబడ్డాం. నీ నుంచి వెచ్చనైన ఉచ్చ్వాసలు, ఆ చల్లదన మధ్య బరించలేని వేడి. ముంగురులు నీ ముఖం మీదకు వాలి ముత్యాల్లాంటి చినుకుల్ని రాలుస్తున్నాయి. నీ అధరాలు తడిసిన లేత గులాబీల్లా గాలికి స్పందిస్తున్నాయి ప్రకృతిలోని సౌందర్యమంతా నీలో కుమ్మరించినట్లు...!
  
       'ఇప్పుడు ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిదో' అన్నది ఓ కవయిత్రి. కానీ నా గుండెలో నిశ్శబ్దంగా కురుస్తున్న ఈ వాన మాత్రం నీదే... ఏం చెప్పను, ఎం చేయను. పదేపదే గుర్తుకు వస్తావు. నీవు లేకుండా వర్షం వచ్చినందుకు తిట్టాలనిపిస్తుంది ఈ వర్షాన్ని. 'అయినా మనలాంటి ప్రేమికులెవరో ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటార్లే' అని నాలో నేనే సంతోషపడతాను. ప్రకృతిని చూసి, లీనమై, లయమై దానిలో ఆనందాన్ని పొందేవాళ్లు తగ్గిపోయారు. అంతా ఇంటర్నెట్..., ఫబ్ లు, కుత్రిమమైన లైట్స్... యాంత్రిక సౌందర్యం కోసం వెంపర్లాడుతున్నార్రా...!. ఇలాంటి వాళ్ల మధ్య ఈ సాయంత్రం ఓ ఒక్క జంటైనా వర్షానుభూతిని అనుభవిస్తూ ఆ సౌందర్యాగ్నిలో భస్మమవ్వక పోతారా...!? అనుకుంటాను.
   
     నంగనాచిలా వర్షం ఆగిపోగానా తెలిమబ్బులతో ఆకాశం సిద్ధమైంది... రాలిన చినుకుల జ్ఞాపకాల్ని నెమరువేసుకోడానికి. ఈ మధ్య ఒకరోజు వర్షంలో టీ తాగుతుంటే... 'వర్షంలో తడుద్దామా...?' అని అడిగింది స. సరే అని ఇద్దరం పిచ్చిగా తడుస్తూ రోడ్ పై జారే ప్రవాహంలో పాదాలను అభిషేకిస్తూ చాలాదూరం నడిచాం. ఎందుకో అనుభూతి, అంటే ఫీల్ లేదు. ఉండదని ముందే తెలుసు. ఆమెదో విరాగి బ్రతుకు. తనకుండే అహం నుంచి మాట్లాడుతుంది. డబ్బు, దర్పణం, కులం... ఏవో ఈ సమాజం మనకు బదిలీ చేసిన పాతచింతకాయ పచ్చడిలోంచి మాట్లాడుతుంది. అయినా అవవ్నీ ఎప్పుడో నేను వదిలేశానని తనకు తెలియదు కదా...! ప్రేమంటే... ఇవ్వడం. ప్రేమంటే... కోల్పోవడం. ప్రేమంటే... మన హృదయానికి మనమిచ్చే అద్భుతమైన కానుక. ప్రేమంటే... మనల్ని మనం అర్పించుకోవడం. 'దేవుడా నీకు లంచమిస్తాను. నా కోరికలు తీర్చు' అనే ఈ పాడు లోకానికి ప్రేమ గురించి చెప్పడం వేస్టే...! అనిపించింది. వర్షంలో చాలాసేపు సుబాబుల్ చెట్లకింద కూర్చున్నాం. అనుభూతుల్లేని జీవితాల్లా... ప్రకృతి వికర్షించిన సునామీల్లా... ఆమెను సమాధాన పరచడానికి చాలా శ్రమించాను. ఓడిపోయాను. 'చాలామంది అమ్మాయిలు అంతేరా గోడలు కట్టుకొని, అద్దాల్లోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ భయపడుతూ, తిడుతూ... అలా అలా... అంతే' అన్నావు చూడు నీ మాటలు అక్షరాలా నిజం. స తో మాట్లాడినప్పుడు నిజమని తెలిసిపోయింది. తర్వాత నేనెప్పుడు అంతగా మాట్లాడటానికి ఆమెకు అవకాశం ఇవ్వలేదు.
  
    ఇదిగో అక్షరాలు ఇలా వెళ్తున్నాయా...! వానలో తడిసిన నువ్వు ఈ అక్షరాల్లో ఒదుగుతున్నావు. నా గుండెను తడిచేస్తున్నావు. ఆ తడి నా కళ్లల్లో... చినుకులుగా కురుస్తుంది. ఇప్పుడు నువ్వుండే చోట కూడా వర్షం కురుస్తుందా...? తడుస్తున్నావా...?! ఆ సంతోషంలో నీ మల్లెల నవ్వును ఆరబోస్తున్నావా...!!!
 
                                                                                 జ్ఞాపకాల పుటలో ఓ వాన

Tuesday 22 July 2014

కల... కల్పన... కళ

                                                


                                                       
ఎద వాకిళ్లు తెరిచి వెన్నెలను దోసిటపట్టిన రోజుల్లో జ్ఞాపకానికి ఇంత పదును ఉంటుందని తెలియదు. ఎదను కోస్తూ... జీవితం కత్తి అంచుపై యమపాశంలా నర్తిస్తున్నదని తెలియదు. తెలియదు పాపం తెలియదు... ఎడబాటుకు మండుటెండకున్నంత పదును ఉంటుందని నిజంగా తెలియదు. ఊహలు, ఊసులు, ఆశలు, ఆశయాలు మాత్రమే యవ్వనపు పొరిమేర్లలో గమ్మత్తుగా సంచరిస్తుంటే నీ వేడి నిట్టూర్పుల మధ్య కాలాన్ని కౌగిళ్లగా కరిగించిన రోజులకు తెలియదు. పాపం తెలియదు. తెలియదు... తెలియదు. మరణం ముందు ఊగిసలాడే గుండెను ఒడిసిపట్టి కన్నీటిలో ముంచేస్తుందని ఆరోజు తెలియదు... ప్రియా తెలియదు. నిజంగా తెలియదు. అసలు ప్రేమ జగత్తులో మరో మాయా జగత్తు ఉందన్న సత్యం తెలియదు. తెలియకపోవడం కూడా తెలియదు ఈ పిచ్చి ప్రేమ మదికి.  నీ వక్షం మీద ఆన్చిన ఈ తలలో ఇన్ని కల్లోలాలు చెలరేగుతాయని తెలియదు. నిఝంగా తెలియదు.
 
         వాడెవడో విరహం అంటా...నాతోనే నిత్యం జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ స్నేహితుడిలా ప్రాణం తీస్తున్నాడు. ఆది అంతంలేని ఈ చరాచర జగత్తుకు వాడే రాజ్యాధిపతి అట. దేవుడు, సైతాన్ రెండూ వాడేనట. నిన్ను నన్ను ఈ కాలగతిలో చక్రంలా తిప్పేది వాడేనట. ఆ రోజుల్లో హృదయం సినిమా చూసి ప్రేమదేవత ముందు మోకరిల్లిన ప్రేమికుడి గుండెనుండి వచ్చే శూలాల్లాంటి మాటలకు నే కార్చిన కన్నీరుకు లెక్కల్లేవు. ఇప్పటి నా వర్తమానానికి అది పునాది అన్న దృశ్యం తప్ప. సంతోషం అంటే ఏమిటి... ఎక్కడ దొరుకుతుంది... ఎసలు సంతోషం అనేది ఉందా... మనకు మనం కల్పించుకున్న భ్రమా... ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు. ఈ మర్రినీడల్లా సాగే జీవితానికి పరమార్థమే కాదు. అర్థం కూడా లేదేమో... సన్యాసులకూ తెలియక అలా తిరుగుతున్నారేమో... దేవుడిపై భారం వేసి మధ్యతరగతి మానవుడు ఆ ఆలోచనల నుంచి తప్పుకుంటున్నాడేమో... నిజాల్లేవు, అబద్దాల్లేవు... అంతా కల్పించుకున్న ఓ కుత్రిమ జీవిత చిత్రం. నిజమే కదా... అవును నిజం. నిప్పులాంటి దహించే నిజం.
 
           అక్షరాలు గుండెనరాలును తెంచేస్తూ నీ గుర్తులను ధారగా కురిపిస్తున్నాయి. అవి చిదుగుల్లా పొడిపొడిగా రాలుతున్నాయి. అమావాస్యరోజు కురిసే చీకటి సవ్వడిలా... స్మశానం లాంటి నిశ్శబ్దాన్ని మోస్తూ... పదాలు, వాక్యాలు. అర్థం మాత్రం నీవు వదిలేసిన దేహం మత్రమే. దెయ్యాల్లా రాత్రులు శరీరం నిండా గాయాలు చేస్తున్నాయి నీ చేతి గుర్తులను జ్ఞప్తికితెస్తూ... అయినా ప్రేమను పంచుకోడానికే కాదు. కోపంలో కసురుకోడానికీ ఓ తోడు లేకపోతే...ఎంత హాయిగా ఉంటుంది. రోడ్డు మీద మన తలమీదే ఓ నాలుగు చక్రాల వాహనం ఎక్కినట్లు, ఓ ట్రైన్ హటాత్ గా మనలోకి దూరి వెళ్లినట్లు... అవును ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమలో తాము, తమతో తాము యుద్దం చేస్తున్న ఓ సైనికుడే... ఏకాంతాలు, ఒంటరితనాలు చలినెగళ్లులా కాగుతున్న రక్తకాషారాలే... అప్పుడు ఎవరికి వారే ఓ సునామీ, ఓ బద్దలవుతున్న అగ్ని పర్వతం...
 
           ప్రపంచంలో అన్నిటికన్నా సుఖమైంది, సంతోషమైంది మరణం అట. కాఫ్కా కథలు చదువుతున్నా... జీవితం మరణం వైపు సాగే కళ అట. అవును కళ కల్పన, కల్పన కళ. కల ఓ వాస్తవానికి ప్రతీక. ఫ్రాయిడ్ ఎలా చెప్పాడో... కలల తీరాన్ని దాటే మనిషి అంతరంగాన్ని. ఆ కలల ఒడిలో మునిగిపోయే మనో తీరాన్ని. ఏడుపు గొప్ప కళ అట. ఆ కళ అందరికీ చేతకాదట. అవును నేను నిజంగా ఆకళలో నిరక్షరాస్యుడ్ని. ఎడుపు నా కళ్లనుండే కాదు, నా గుండె నుండి కూడా వెళ్ళిపోయింది. నిషేధం విధించింది నాపైన... మనస్ఫూర్తిగా ఏడిస్తే భారం తగ్గుతుందట. ఏడవకు అని మాట తీసుకొని వెళ్లి... ఏడుపునే నాకు దూరం చేశావు.
 
            ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలులేవు. మబ్బుల్లేవు. మానవత్వం లేదు. మనో నేత్రం విప్పే మనుషులు లేరు. నేను ఇక్కడో వలస జీవిని. ఎదస్పర్శలన్నీ ధనంలోకి కుదించబడ్డాయి. ఐదుకు, పదికి ప్రేమలు దొరుకుతున్నాయి. వాటికి ప్రేమ అని పేరుపెట్టి శరీరాలను డబ్బుతో కొనుక్కుంటున్నారు. పెళ్లిళ్ల పేరుతో వ్యాపారం సజావుగానే సాగుతుంది. కట్నాలతో కూడా ప్రేమలు బాగానే దొరుకుతున్నాయి. ముసుగుల మధ్య జీవితాలు నాట్యాలు చేస్తు... నటిస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ నేనే.  నాలో నేను ఉప్పొంగే సముద్రం, వర్షించని నా ఎడారి కళ్లు తప్ప అంతా బాగనే ఉంది. చావుకు, బతుక్కు మధ్య గడియార లోలకంలా కొట్టుకుంటుంది నా ఎద లయ. వింటే మనసుంటే..., తట్టుకునే నీ లాంటి శక్తి ఉంటే...
 
             కాలం ఎప్పుడూ ఇంతే అకారణంగా హత్యలు చేస్తుంది. నిన్ను, నన్ను, మరణాన్ని, మన ప్రేమను... ఎన్నని చెప్పను. తగలబడుతున్న నా ఎద సాక్షిగా... ఇంకో సారి చెప్తా విను. ఇక్కడ ప్రేమలు లేవు. అవసరాలు, అవకాశాలు, కోర్కెలు, డబ్బు, హోదాలు, కీర్తి... వాటికోసం నటన. మరి నేనెలా బ్రతకాలి... నీ పాటికి నీవు వసంతాన్ని వెంటేసుకుని, నీయాత్రను ముగించుకొని అలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయావు. నాకు ఇక్కడేం పని. నే చెయ్యాల్సిన పనులు ఏముంటాయి. ఈ రక్కసి మనసుల మధ్య, ఈ వస్తువినిమయ మనుషుల మధ్య... అందుకే అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఆరిపోయిన వెలుగుల మధ్య ఆరిపోయిన కొవ్వొత్తిని ఎవరూ వెలిగించడానికి ప్రయత్నించకండి. ఈ పేజీ చించేయబడింది. ఈ పుస్తకం శాశ్వతంగా మూసివేయబడింది. దయచేసి చివరి అట్టకూడా తెరవకండి. అటునుంచి చదవాలని పిస్తుంది.
 
                                                                                                  బై.... 
ఒక జీవితకాలం... కాలం... లయం... యం.       

Friday 11 July 2014

ఓ పిచ్చి కవిత

                  

ఏం రాయను ...?

అనంత కాంతి సంవత్సరాల తర్వాత...?
నాలో నిన్న వెతికి పట్టుకోవాలని...!
దూరాన్ని దగ్గరగా శపించుకుని
నేను గుర్తున్నానా...!?
అని నా అంతరంగపు విరహాన్ని అడిగితే...
ఏం చెప్పను...!?
చలన సూత్రాల నిండా
బుహముఖ స్వాప్నిక జగత్తును గుండెలకెత్తుకొని
నీకై... నీదై... రోదిస్తున్నా...!!!
ఏం చెప్పను...?
నీవు లేని క్షణాలలో ఎదలో రగిలిన కణాల జ్వాలాక్షరాలను
ఎలా రాయను...?
అన్వేషణ ఆఖరిపుట తిరగేస్తూ
ఒక్కో ఓదార్పు భాష్పజలమై నిరాశగా జారుతుంటే...!
ఏం రాయను...?
నాలోని నిన్ను గురించి

నేనే నీవైతే ....!!!

Monday 7 July 2014

మీరు లవ్ ఫెయిలా... అయితే పండగ చేసుకోండి.


అసలు ప్రేమలో ఫెయిలు, పాస్ లు ఉండవు. మనం ప్రేమించడం, ప్రేమించక పోవడం మాత్రమే ఉంటుంది. మనం ఇష్టపడ్డామని అవతలి వాళ్లు మనల్ని ఇష్టపడాలన్న రూల్ లేదుకదా... అయినా ఎదుటి వాళ్లు పుట్టి, పెరిగిన వాతావరణ పరిస్థితుల్లోంచే... వాళ్ల అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటికి అనుగుణంగా మనం ఉన్నామా, లేమా అని అంచనా వేస్తారు.
 
మన మనసుకు నచ్చిన విషయాలలోంచే ఎదుటి వాళ్లను చూస్తాం. దగ్గరగా ఉంటే ఓకె అనుకుంటాం. ప్రపోజ్ చేసిన వారికి ఓకె చెప్తాం. లేదా అలాంటి వాళ్లు తారస పడితే మనం ప్రపోజ్ చేస్తాం. అసలు ప్రపంచంలో 99 పర్సంట్ లవ్ లు ఫెయిలవుతాయి. 1 పర్సంటే పాస్. బాగా చదివి యక్జామ్ రాయడం వరకే మనం చేసేది. మనం కరెక్టుగా ఉన్నామా లేదా... అనేదే చూసుకోవాలి. ఫెయల్ అయ్యామనుకో... అది ఎదుటి వాళ్ల తప్పు. మరో సారి, మరో ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలి. అంతే...
 
అసలు ప్రేమంటే... ఇది అని ఎవరూ చెప్పలేరు. అది మనసులోతుల్లోంచి అనుభవంలోకి వచ్చే అనుభూతి మాత్రమే... అది కలగా మిగలకుండా, కథగా కాకుండా జీవితాంతం సాగాలని కోరుకుంటారు. కానీ సమాజం కల్పించిన ధనం, మతం, కులం, ప్రాంతం ఇలా... అనేక అడ్డంకులతో ఆగిపోతుంది. మరో వైపు జీవితాన్ని లాగేసుకుంటుంది.
 
     అయితే ఈ మధ్య ఎక్కువమంది లవ్ ఫెయిల్యూర్స్ ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. వాళ్లలో ఎక్కువ మంది 15 నుండి 30 మధ్య వయసు వాళ్లే...
 ప్రేమ ఓ సుందర స్వప్నం కావచ్చు. ప్రేమ ఓ అద్భుత ఛేతన కావచ్చు. ప్రేమ అనుభవంలోని ఓ తీయని జ్ఞాపకం కావచ్చు. కానీ అన్నిటికీ మించినది జీవితం. జీవితంలో ప్రేమ ఓ భాగం. ఓ చిన్న వీచిక. ఓ అలమ మాత్రమే.
 
     ప్రేమ సక్సెస్ కావాలను కోవడం మంచిదే... అలానే కాకుండా ఉండటం కూడా ఇంకా మంచిది.
ప్రేమ విఫలమైతే అది మన తప్పు కాదు. ఎదుటి వాళ్లు మనల్ని అర్థం చేసుకోకపోతే అది వాళ్ల దురదృష్టం. అలాగని మనల్ని, మన జీవితాల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. వాళ్లు మన జీవితంలోకి రాకముందు చాలా జీవితం మనకుంది. అలానే వాళ్లు లేని ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఒక రైలు మిస్ అయితే మరో రైలులో వెళ్తాం. అంతేకానీ జీవిత ప్రయాణాన్ని ఆపుకోం కదా...ఆపుకోకూడదు. 
 
1. ప్రేమించినోళ్లు... నో అని చెప్పిన వెంటనే... అది మనలో మనం దాచుకోకూడదు. మన మనసుకు దగ్గరైన వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు వెెంటనే వాళ్ల ఓదార్పు దొరకి మనకు కొంత ప్రశాంతత, ఓరట కలిగిస్తుంది.
 2. దగ్గరున్న వాళ్లతో ఓ చిన్న పార్టీ చేసుకోవాలి. ఆనందం అంటే వాళ్లతోనే కాదు, ఇతరులతో కూడా పంచుకోవచ్చు అని తెలుస్తుంది. అప్పుడు అనేక మంది... వాళ్ల లైఫ్ లోని అనుభవాలు మనతో పంచుకోవటం వల్ల మనలాంటి వాళ్లు చాలామంది ఉన్నారన్నది మన ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
3. వెంటనే వాళ్లని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అందుకు మన టేస్టులను, అభిరుచుల్ని గుర్తు చేసుకొని.. ఉదాహరణకు నేచర్ ను ఎంజాయ్ చేయడం, పుస్తకాలు చదవడం, మనకున్న ఆర్ట్స్ కు దగ్గరవడం ఇలా...
4. ఇంతకు ముందు మనకు దగ్గరగా ఉన్న వాళ్లని బాగా గుర్తు చేసుకొని వాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. లేదా వీలైతే పాత ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు గడపాలి.
5. వాళ్లుమనకు పరిచయం కాకముందు మనకున్న తీయటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవాలి.
6. వాళ్ల జ్ఞాపకాలను గుర్తుచేసే వస్తువుల్ని, గిఫ్టులను దూరంగా ఉంటాలి. అలానే ఫోన్ నెంబర్ లాంటివి డిలిట్ చేయాలి.
 
                    వీటితో పాటు మనకేం తక్కువ... అనే నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ప్రపంచంలో ఒక్కరే కాదు. అంతకంటే మంచి వాళ్లు మన లైఫ్ లోకి వస్తారన్నా ఆలోచనను పెంచుకోవాలి. అసలు మనకు ఎదుటి వాళ్లు సరైన వాళ్లు కాదేమో... దూరమవడం మన మంచికే అనే తత్వాన్ని పెంచుకోవాలి. అదే నిజం కూడా... నాకేం తక్కువ అనే ఆత్మాభిమాన్ని పెంచుకోవాలి.
 
               అన్నిటిని మించి ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లైఫ్ లో బాగా ఎదిగి మనమేంటో రుజువు చేసుకోవాలి. మనకు ఎందుకు దూరమయ్యానా, అనేలా వాళ్లు ఆలోచించుకునేవా జీవించాలి. అలాంటి జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆదిశగా జీవితాన్ని నడిపించాలి. చరిత్రలో మనకూ ఓ పేజీ ఉందని రుజువు చేసుకోవాలి. ... ఇలాంటి భావాలతో అనునిత్యం జీవితాన్ని ఉత్సాహం వైపు నడపాలి. ఆచరణలో పెట్టాలి. పూర్చి పాజిటివ్ థాంట్స్ తో మైండ్ నిండిపోవాలి. మనల్ని మనం గులాబివనంలా మార్చేకుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో దేవదాసులు, పార్వతలు లాంటి జరగని కథలు కాదు కావల్సింది.   ప్రతి మనిషి జీవితంలో ఓకే ప్రేమ ఉండదు. కొన్ని ప్రేమలు ఉంటాయి. ఇదో అనుభవ సత్యం. ఇది కాకపోతే మరోటి. అది కాకపోతే మరోటి. కానీ మన లైఫ్ మనకు సత్యం. 
 
ఆల్ దబెస్ట్ లవ్ ఫెయిల్యూర్స్...
ప్రపంచం మనదే...
ప్రపంచం నిండా మనమే...
జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం...
పెయల్ లో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేద్దాం.
జీవితంలో మనమేంటే నిరూపించుకుందాం...
మన లక్ష్యాలవైపు సాగిపోదాం...
ప్యూచర్ మనదే...
మనల్ని కాదన్న వాళ్లు ఈర్ష్య పడేలా ఎదుగుదాం... 
జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభిద్దాం
                                              బై
                                మైడియర్ లవ్ ఫెయిల్యూర్స్

Friday 4 July 2014

అలలు వదలని కడలి



దృశ్యాలన్నీ అదృశ్యాలవుతున్నాయి. ఎదలోని ఎద తనలోకి తాను మునగదీసుకొని నిద్రకు ఉపక్రమిస్తుంది. ప్రతి చర్య ప్రతిచర్యను కోరుకుంటుంది. ఆకాశం నీటిని ఇచ్చి మేఘాల ద్వారా మళ్లీ గ్రహించనట్లు. మనుషులు అసలు నచ్చడం లేదు. హటాత్తుగా ఈ మానవ ప్రపంచం గొప్ప అద్భుతమైన వనంగా మారిపోతే...! చెట్లు చేమలు. పక్షులు, జంతువులు, పువ్వులు, లేనవ్వును పూసుకునే మొగ్గలు, తొలికిరణాలను ముద్దాడే మంచు బిందువులు...! ఎంత బావుంటాయి. ఈ కాంక్రీట్ భవనాల మధ్య, మనుషుషులు, వారిలోని మనసులు పూర్తిగా  కాంక్రీట్ గానే మారిపోయాయి. నేనే మారలేక నా జ్ఞాపకాల వలలో చిక్కుకుని ఆత్మను తొవ్వుతున్నాను పగలు రేయి తేడా లేకుండా...

నిద్రకు వెలియై నేనొంటరినై అన్నాడో కవి, అవును దీనంగా నా చూపులు నన్నే ప్రశ్నిస్తున్న వేళ... సమాధానాల కోసం కొత్తదనాన్ని వెతుక్కోలేక పోతున్నా, ఆశకు అనుభవాలకు మధ్య బంధించబడి శిలాక్షరంలా ఉంటున్నా...! నీకో విషయం చెప్పనా...! భూమ్మీద సూర్యప్రతాపం ఎక్కువైంది. వానలు కనుమరు గవుతున్నాయ్. నీవు ఉంటే ఎంత భాధపడే దానివో కదా...! నీవు వర్షంలో తడుస్తుంటే... నీ నల్లటి కురుల్లోదాగలేక ఎన్ని నీటి బిందువులు నక్షత్రాలై నేలపై రాలేవో...! ఎన్ని కవితలు నీ ఆనందపు పొలిమేరల్లోంచి నా సెల్ లో ప్రక్షమయ్యేవో...! ముద్దుల మాటున జల్లులు విరిసిన క్షణాలను ఎలా మర్చిపోగలం. కాలం చెక్కిలిపై నీ అధరాల చప్పుళ్లను లిఖించలేని ఈ చరిత్ర ఎంత కోల్పోయిందో కదా...! అయినా ప్రకృతి అందాలకు మైమరచిన దేవుడు దానికి మించిన సౌందరాన్ని స్పృజించాలనే కాంక్షతో స్త్రీని ఈ భూలోకం మీద సృష్టించి ఉంటాడు. నీ దేహంలో విరిసే ఇంధ్రదనసులు, విరగే నెలవంకలు, నీలికొండల మధ్య సంద్యాసమయాలు, చిరు గరికలై విచ్చే లేలేత పాదాల రవళులు, వన్నెలపువ్వులై విరిసే నవ్వుల పువ్వులు, పవిత్రమైన పూజకోసం పుష్పించే మొగ్గల వేళికొసలు, నడుమొప్పుల్లో దాగిన లతా మణులు... ఎన్నని చెప్పను.!
 
గతకాలపు ప్రేమ పుటలు నీ ప్రేమని నింపుతంటే.., ప్రస్తుతం, కన్నీరై అక్షరాలను అభిషేకిస్తుంది... ప్రియా...! ఆనందం లేదు, ఆత్మతృఫ్తి లేదు, అరమరికలు లేవు, అభిషేకాలు లేవు, ఆలింగినాలు లేవు, అనురాగాలు లేవు, ఆత్మీయ స్పర్శలు లేవు, వెచ్చటి దేహంలో కాంతి పరావర్తనం చెందే క్షణాలు లేవు. వదలలేని నిశ్వాస తాళ వృంతాలు లేవు. ఘనీభవించిన రెండోజాము చీకటి పెళ్లలు తప్ప. ఇంకా భయం, చేదులాంటి భయం, తీపి లాంటి భయం... తీపికి చేదుకు మధ్య విరక్తి చెందే రుచిలేని భయం. అందుకే... మనుషులకు దూరంగానే ఉంటున్నాను. ఎదను కాల్చే వెలుగులో నాకునేను చలి కాచుకుంటున్నాను. ఆ చలిలోంచే ఈ వాక్యల విస్పోటనలు. ఎప్పటిలాగే మానవ ప్రపంచానికి అంటీ అంటనట్లు బతుకుతున్నాను. ఇమడలేని మనుషుల మధ్య మేఘాల మధ్య సూర్యుడిలా  కాలుతూ తిరుగుతున్నాను. ఏమీ తోచదు. నిస్తేజం. నిస్పృహ.
 
నీలిలిట్మస్ కాగితాల మనసుల మధ్య ఏ దరికి చేరాలో తెలియదు. ఈ ప్రపంచానికి ఓ సృష్టికర్త ఉన్నాడు అంటారు. నిజంగా ఉంటే... ఈ మనుషుల మీద జాలి, దయ లేకుండా ఎందుకిలా తయారు చేస్తున్నాడు. ఆ దేవుడు కూడా మనిషిలానే ప్రేమ లేనివాడా... ఏమో...! నీవు అన్న ఓ మాట ఎప్పటికీ ఏ సత్యం... నీ నోటి నుంచి నే విన్న నీ భక్తి శ్లోకాలవలే...
 
నేనెప్పుడూ నీతోనే ఉంటా... నీ లోనే ఉంటా..
అంత ప్రేమ సాధ్యం కాదురా అంటారు ఈ మనోవృద్ధులు. శరీరాలు, ధనంలో సుఖాన్ని వెతుక్కునే అల్పజీవులు. ఎందుకు బతుకుతున్నామో తెలుసుకోలేక. సృష్టిలోని బంధాలన్నీ ఇంతే అనుకుంటారు. అల్ప మనుషులు, అల్ప సంతోషాలు. వీళ్లకు ప్రేమించడమే కాదు, ప్రేమించహబడమూ తెలియదు. రాదు అనుకుంటాను. కొద్ది గా వర్షంలో తడిసి, అబ్బా... తడిసి పోయాను, అని ఆరబెట్టుకునే మనుషులు. అహాన్ని ఎలా వీడతారు. నాది అనే భావనలోనే చిక్కుకొని దానిలోనే అందరిని కుదించి చూస్తారు. ఒక్కసారి బైటకు వస్తే ఎంత ప్రేమమయం. మనిద్దరిలా ఈ లోకం. ఎంత సుఖం... ఆత్మపరమాత్మల సంయోగంలా... నీలా నాలా...
 
ఈ సాయంత్రం గాలి చల్లదనాన్ని పూసుకొని వీస్తుంది. ఇన్ని పరవాల శరీరాలలో ఒక్కరైనా దాని తాకిడికి స్పందించక పోతారా... వేటూరి అన్నాడు పరువానికి బరువైన యువతీ... ముందు నువ్వు పుట్టి తర్వాత సొగసు పుట్టీ... మొదటి వర్ణన దేహానికైతే, రెండోది ఆత్మకని నా భావన. ఈ మధ్య రవీంద్రుడి  గీతాంజలిని మరోసారి చదువుతున్నా... ఎవేవో కొత్తతెరలు నాలో లేస్తున్నాయి...! నీ కవితల్లో... నిండిన నా పూరణలే గుర్తుకు వస్తున్నాయ్. ఒక్కటి మాత్రం నిజం ప్రియా...! మనసు పుష్పించినప్పుడు, ప్రేమ అంకురించినప్పుడు, విషాదం విరహమై దావానలంలా మనలో రేగినప్పుడు... తప్పక కవిత పూస్తుంది. నీవన్నీ భావాల్లో తేలిన పారిజాతాలే... వాటిలో నిండిన నా మనసుది ఒక జీవితకాలం చాలని ప్రేమ... ...
 
అలలే సముద్రానికి అలంకరణ, నీ జ్ఞాపకాల మత్తే నాలో ఆ అలల పునరుత్పత్తి.
ఎవరో అన్న గుర్తు...
                       కెరటం నా ఆదర్శం     
                       లేచి పడినందుకు కాదు
                        పడినా మళ్లీ లేచినందుకు.
                                                 ----  అలల భాషతో

నిశీథి వీచిక


కరిగే చీకటి మధ్య
       నిలువునా కూలుతున్న దృశ్యాన్ని
 
నిట్టూర్పుల్తో ఏకాంతాన్ని సైతం
        విచ్చిన్నం చేసుకుంటున్న జీవితాన్ని
 
రగులుతున్న చితుల మధ్య
         కుంగి పోతున్నఅదిభౌతిక చర్యని
 
ఏ ఆచ్ఛాదనా లేని మనసుకు
        ఆనవాలుగా శరీరాన్ని చూపలేని స్పర్శని
 
ఒక్క ఓదార్పు కోసం
          జారని కన్నీటి బిందువు చారికని
 
జారుతున్న కుంతలాల మధ్య
         గుండెతడిలేని చీకటి చంద్రికని
 
ఎన్నో నిరాశుల మధ్య
          చుక్కానిని వెతుక్కోలేని ద్వీపాంతర వాసిని
 
అసలు ఎప్పుడో...
 నాకు నేనుగా కాలం పొరల్లోకి
           వలసెళ్లిపోయిన నిశీథి వీచికను