తెలుగు సినిమా పాటకు మనసు తడిని
అద్దిన కవి ఆత్రేయ. మనోలోతుల్ని అక్షరాల్లో రంగరించి ప్రతి గుండెకు పాటల
రూపంలో అందించిన మనస్వి. నాటకాలతో ప్రజాచైతన్యానికి బాటలు వేసిన
అభ్యుదయవాది. అలతి పదాల్లో అనల్పార్థాన్ని నింపిన భావకుడు. తెలుగుతెర వెండి
పాటల్లో చందమామలా ప్రకాశించే సూర్యుడు ఆత్రేయ.
ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట
నరసింహాచార్యులు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడులో మే7,
1921ల జన్మించాడు. చిన్ననాడే తల్లి మరణించింది. వీరిది ఆత్రేయ గోత్రం.
అందుకే పేరును గోత్రంతో కలిపి ఆచార్య ఆత్రేయ అని పేరు పెట్టుకున్నాడు.
ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాటకాలమీద మోజుతో చదువుకు స్వస్తి పలికాడు. ఆ
పైన టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశాడు. లేఖకునిగా,
గుమస్తాగా, పత్రికా సంపాదకునిగా ఉద్యోగాలు చేసి... చివరకు సినీప్రపంచంలో
స్థిరపడ్డాడు.
పాటల రచయితగానే కాకుండా ఆత్రేయకు నాటక
రచయితగా గొప్ప పేరుఉంది. ఎన్.జి.ఓ., ఈనాడు నాటకాలు రచించి ప్రదర్శనలు
ఇస్తూ ఆనాటి ఆంధ్రదేశం అంతా పర్యటించాడు. 1949లో 'ఎన్జీవో' నాటకానికి ఆంధ్ర
నాటక కళాపరిషత్ పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. అటుపై హ్యాట్రిక్ కూడా
సాధించింది. విశ్వశాంతి, కప్పలు, భయం, బలిదానం, ఒక రూపాయి, తెరిచిన
కళ్లు... లాంటి సుమారు 15 నాటకాలు నేడు అందుబాటులో ఉన్నాయి. ఆత్మకథను 'తొలిగాయం'
పేరుతో పద్యరూపంలో రాశాడు. వీరి రచనలు మొత్తం 9 సంపుటాలుగా మనస్విని సంస్థ
ముద్రించింది. అంతేకాదు ఆరోజుల్లో ఆత్రేయ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని
ఆర్నెళ్లు జైలు శిక్షకూడా అనుభవించాడు. తర్వాత క్రమంగా కమ్యూనిస్టు
భావాలవైపు ఆకర్షితుడయ్యాడు.
1951లో విడుదలైన 'దీక్ష'చిత్రం
ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సుమారు 400 సినిమాలకు, 1400 పాటలు
రాశాడు. ఆత్రేయ తన పాటల్తో మనసుకు కొత్త భాష్యాలు చెప్పాడు. మనసులోని
భావాల్ని, అంతరంగ లోతుల్ని, పొరల్ని విడివిడిగా తన పాటల్తో అల్లారు.
ఎటువంటి శబ్దడాంబికాలు లేకుండా నిర్మలగంగా ప్రవాహంలాగా సరళమైన పదాలతో పాటలు
రాశాడు. ప్రజల మాటల్నే పాటలు చేశాడు. రాశాక తన పాటల్నే మాటలు చేశాడు.
అత్రేయ చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం అవడం వల్ల ఆ ప్రేమ మాధుర్యాన్ని
అమ్మపై రాసిన పాటల్లో కురింపిచాడు. 'అమ్మంటే అమ్మ, అనంత సృష్టికి ఆమే అసలు బ్రహ్మ' (రామ్ రాబర్ట్ రహీం) అన్నాడు. 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నోతెలియని మమతల మూట' (బుల్లెమ్మ-బుల్లోడు) అని కూడా వర్ణించాడు.
ఇక ప్రేమ గురించి, ప్రేమికుల
గురించి, ప్రేమలోని ఆనందం, విషాదం, విరహం, బాధ, ఒంటరితనం గురించి ఎన్నో
పాటలు అద్బుతంగా అందించాడు. అసలు ఆత్రేయ జీవితంతోనే ప్రేమ అనే పదం
ఆడుకుందేమో అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే... స్కూలు ఫైనల్ చదివేటప్పుడు
పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించి, ఆమెకు దూరమయ్యాడు. ఆలా తొలిగాయం నుంచి
ఆత్రేయ కోలుకోకుండానే ప్రేమకోసం తపించి ఎన్నో అనుభవాలను, వైఫల్యాలను
పొందాడు. అవే ఆయన పాటల్లో మనకు దొరుకుతాయి.
స్త్రీని ఉద్దేసించి 'ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు, ఆడుకున్నా ఫర్వాలేదు పగలగొట్టి పోతారెందుకు' (ఆడబ్రతుకు) అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు 'ఓ హృదయం లేని ప్రియురాలా... రాయికన్న రాయివి నీవు, కసాయివి నీవు' (కన్నె వయసు) అని నిందిస్తాడు. ప్రియురాలి ప్రేమకై తపిస్తూ 'నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది' (ఇంధ్రదనస్సు) అంటాడు. ప్రేమించి విఫలుడైన ప్రియుడి గురించి 'మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మసున్న మనిషికి సుఖము లేదింతే '(ప్రేమనగర్) అని విరక్తి చెందుతాడు. 'మనిషికి మనసే తీరని శిక్ష' అని నిర్ణయానికి వచ్చేస్తాడు.
పవిత్రమైన ప్రేమికుల గురించి చెప్తూ 'మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెపుడో కలసి పోతది' (మూగమనసులు) అంటాడు. పైగా అదే చిత్రంలో 'మనసు మూగదే కాని బాసుంటది దానికి' అని మనోభాషని నిర్వచిస్తాడు. 'మనసుతోటి ఏలాకోలం ఆడుకోకూడదని' విజ్ఞప్తి చేస్తాడు. 'మనసు లేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు' (ప్రేమలు-పెళ్లిళ్లు) అని ఆ దేవుడ్నే నిందిస్తాడు. ప్రియురాలికి దూరమైన ప్రేమికుడి బాధను చెప్తూ 'ప్రేమఎంత మధురం, ప్రియరాలు అంత కఠినం... ప్రేమలేదని ప్రేమించ రాదని' (అభినందన) అంటాడు. ఇక ఆత్రేయను మనసుకవిగా నిలిపిని పాట 'మౌనమే నీబాస ఓ మూగ మనసా...' (గుప్పెడు మనసు) దీనిలో మనసును ఉయ్యాలగా, దయ్యంగా, చీకటి గుహగా, కూరిమి వలగా... ఎన్నో ప్రతీకలతో విశ్లేషించాడు.
ఆత్రేయ కేవలం మనసు పాటల్నే
రాయలేదు. వలపు పాటలు, జీవితాన్ని తర్కించే పాటలు, ప్రేమ గీతాలు, జానపద
గీతాలను... కూడా సరికొత్త హంగులతో రాశాడు. 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధమూ' (జీవన తరంగాలు) అని మానవ సంబంధాలు చావుకు అతీతం కాదన్నాడు. 'కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చానా నీ బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా... నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాటిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరను తెలుసుకో' (తోడికోడళ్లు) అని పాటలో సామ్యవాదాన్ని ప్రకటించాడు. 'కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా... అన్నా, చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నదానా...' అన్నా ఆత్రేయకే చెల్లింది. 'శేష శైలావాసా శ్రీ వెంకటేశ' అని ఆ ఏడుకొండల వాడిని వేడుకున్నాడు. 'అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం, మమతన్నది ఒట్టి పిచ్చి, మనసన్నది మరో పిచ్చి' (అంతులేని కథ) అని లోకం రీతిని ఎండగట్టాడు. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే...' (ఆత్మబలం) అని తెలుగు తెరపై తొలిసారిగా వాన చినుకుల్ని, వలపు పలుకుల్ని కలిపి రాశాడు.
ఆత్రేయ కేవలం మాటలు, పాటలు,
నాటకాలు మాత్రమే రాయలేదు. దర్శకత్వం వహించాడు, నిర్మాతగా కూడా చిత్రాలు
నిర్మించాడు. అన్నిటికీ మించి 'నీలిమేడ' అనే కథ కూడా రాశాడు. ఈ కథ 1946 జూలై 'భారతి' పత్రికలో ముద్రితమైంది. ఇలా ప్రేక్షకుల మనసుపై మనసుకవిగా ముద్రపడిన ఆత్రేయ సెప్టెంబరు13, 1989లో మరణించాడు. ఆయనే చెప్పినట్లు 'మనసు పోతే మాత్రమేమి మనసు ఉంది'. ఆయన పాటలు మన మనసుల్లో పదిలంగా ఉన్నాయి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆ పాటల్లో వెదుక్కునేలా చేస్తున్నాయి. చేశాయి. చేస్తాయి.