ఈ మధ్య వేదించే ప్రశ్నలు పెరిగాయి. అన్నిటికీ ఒకటే కారణం. అసలు జీవించండం అంటే ఏమిటి? పుట్టడం, ఈ మార్కులతో జ్ఞానాన్ని కొలిచే చదువులను డబ్బుతో కొని, వ్యాపారంగా చదువుకోవడం. కట్నంతో... పెళ్లి పేరుతో ఓ అమ్మాయిని కొనుక్కోవడం. మేం ప్రేమగా జీవిస్తున్నాం... అని నటించడం. అసలు మనస్ఫూర్తిగా స్త్రీని ప్రేమించగలిగినప్పుడు ధనం అనేది ఎందుకు రిలేషన్స్ ను నడిపిస్తుంది. పెళ్లి కాగానే పిల్లలు. వారిని పెంచి పెద్దజేయడం. వద్దనుకున్నా వదలని ముసలితనం. ఆ పై చావు. ఇదంతా బతుకు నాటకం అని వాగ్గేయకారులు ఎప్పుడో గానం చేశారు. కానీ ఈ వెదవ బతుకుకోసం, బతకడం కోసం... ఎన్ని తంటాలు?. ఎన్ని కష్టాలు.? ఎన్ని కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ద్వేషాలు, దోచుకోడాలు... ధనం అనే పిచాచికై వెంపర్లాటలు. సుఖం సుఖం అని మనసుకు సంబంధం లేని వాటిని సమాజంలో ఉన్నతం కోసం కొనుక్కోవడం. ఇదంతా ఆలోచిస్తే మనసు వేడెక్కుతుంది. బతుకు బరువు అవుతోంది. ఇదేనా జీవితం అనివిస్తుంది. ఇలా బతకడం కోసం, గొప్పలు కోసం, ధనం కోసం, కీర్తికోసం పాకులాడడం చూస్తుంటే నవ్వు వస్తుంది. ఈ జీవితానికి అసలు అర్థం ఉందా? అనే ప్రశ్న వెర్రితలలతో నాలో నర్తిస్తుంది.
అసలు మనషులకు ఏమి
కావాలి...? ప్రేమ... ఒకరికి ఒకరు... అనే విడదీయలేని అదిభౌతిక సంబంధం.
స్త్రీ, పురుషుల మధ్య ఉండాల్సిన సౌందర్యాత్మక ఆరాధన. గుండెల్ని మండించే
ప్రేమ. నీకోసం ఈ ప్రపంచాన్ని ధిక్కరించే మరో హృదయ సౌకుమార్యం. కానీ స్టేటస్
పేరుతో తమను తాము, తమ ఆత్మల్ని తాము ఉరితీసుకుంటున్న ఈ జనాల్ని చూస్తుంటే
భయం వేస్తుంది. మొన్న మా బంధువు జ. నిశ్చితార్థానికి వెళ్లాను. నాకు ఆ
అమ్మాయితో చిన్నప్పటి నుంచి చనువు ఎక్కువే... నా పిచ్చి ఆలోచనల్లో ఏవో
కొన్ని నచ్చి ఉంటాయి. నీకు పెళ్లి కొడుకు నచ్చాడా...? అని అడిగాను. వాళ్లు
ఆడోళ్లని బయటకు పంపరు. మర్యాదగా ఉంటారు. టీవీ, ప్రిజ్... ఇంట్లో అన్ని
సామాన్లూ ఉన్నాయి. నన్ను బాగా చూసుకుంటాడు. ఆస్తి బాగా ఉంది. అని సమాధానం
చెప్పింది. నిన్ను బాగా చూసుకోవడం అంటే...? నీవు ఏం చెప్పినా అలానే
నడుచుకోవడం. నీకు అవసరమైన వస్తువులు కొనివ్వడం. ఇంతేనా అన్నాను. అవును...
అంతే కదా కావాల్సింది. పైగా మూడు లక్షలు కట్నం అంది.
ఏం
చెప్పాలో అర్థం కాలేదు. మూడు లక్షలతో కొనుక్కునే సుఖం. మనసుతో సంబంధం లేని
వస్తువులతో ఆనందాన్ని తూచే ప్రేమలు. ఒకరికి ఒకరు లొంగి ఉండే మనస్తత్వాలు...
ఇవే కదా నాకు మొదటిన నుంచీ పడనవి. ఇంట్లో నుంచి బైటకు పంపకుండా స్త్రీ
స్వేచ్ఛను హరించడం. పంపరు అంటే... బైటకు వెళ్తే అనుమానమా...? లేక అతని కంటే
ఎక్కువ స్థాయికి ఎదుగుతుంది అన్న ఈర్ష్యా...? ఏమో... ! ఇన్ని వాస్తవమైన
అనుమానాలు నా పాడు బుర్రకి. చలం ఎక్కడో చెప్పినట్లు గుర్తు... చదువుకున్న
స్త్రీ సోకులకు, ఉద్యోగాలకు, పై అధికారులకు, వినిమయ వస్తువులకు బానిస
అవుతోంది అని. అవును నిజమే కదా...! తెలియకుండానే పురుషాధిపత్యం అంటూ
పురుషునితో సమానం అంటూ.., వారిని అధిగమించాలి అంటూ.., వారిని వాళ్లు
కోల్పోతున్నారు. అందం పేరిట శరీరాన్ని సరుకు చేసి, మనసుతో బంధాన్ని
తెంచేసుకుంటున్నారు. మరి వీరిలో ప్రేమించే గుణాన్ని ఎక్కడ వెతకాలి.? ఒకవేళ
నిజమైన ప్రేమకాంక్ష వీరిలో జొరబడితే తట్టుకోలేరు. అయినా ప్రేమను ప్రేమగా
తీసుకోడానికి వీరి మనసులో ప్లేసు కూడా లేదేమో...! నాకోసం నీచేయిని కోసుకుని
నీవు ఎప్పుడూ నా చేయి మీద గుర్తుగా ఉన్నావు. అన్న నీ మాటలని వీళ్లకు
చెప్పినా అర్థంకాదు. శాడిజం అంటారేమో...!
రెండు రోజుల క్రింత
ర..కు ఫోన్ చేశాను. ముందే చెప్పాను కదా... స్త్రీల పరిచయాలకు పూర్తి దూరంగా
ఉంటున్నానని. కానీ మనసు ఎందుకో చేయాలనిపించింది. శి.ని పెళ్లి చేసుకుందట.
ఎన్ని చాడీలు చెప్పింది. రాత్రిళ్లు కూడా వేరే వాళ్లతో తిరుగుతున్నాడని ఎంత
గగ్గోలు పెట్టేది. ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నాడని ఎంత బాధపడేది. వాళ్ల
ఇంట్లో ఒప్పుకోరని ఎన్నెన్ని మాటలు చెప్పింది. నేను ఎన్ని సార్లు
నచ్చజెప్పాను, ఒదార్చాను. నీకు శి. తగినవాడు కాదని బతిమిలాడాను.. కానీ
తప్పో ఒప్పో జరిగిపోయింది. అతడినే చేసుకుంటాను అని తెల్లటి ముఖాన్ని బాధతో
ఎర్రగా మాడ్చుకునేది. పైగా 'నేను అతడిని ప్రేమించడానికి నీవు, నీ మాటలే
కారణం' అని ఎత్తిపొడిచేది. నేనేం చెయ్యను. మనసును సున్నితంగా ఉంచుకోమనడం,
స్వఛ్చంగా ప్రేమను పంచేలా మనిషి జీవించాలి అని చెప్పడం నా తప్పా...! 'అసలు
నీ మాటలే అంత...! ఎవరైనా అంతే...' అని స. వాళ్ల మరదలు అన్నప్పుడు... కాదని
చెప్పలేక పోయాను. బహుశా దాచుకోవడం, సమాజంలో అందరిలా నటిండం చేతగాని నా
మనసే నాకు ఆ మాటల్ని బహుమతిగా ఇచ్చిందేమో...! అసలు ప్రేమించడమంటే
దహించుకపోవడం అని వీళ్ళకు తెలీదు. ఓ సారి ర. ఏమన్నదో తెలుసా... 'శి. వల్లే
కాదు, నీ దగ్గర కూడా నీవు చెప్పిన ప్రేమను నే పొందలేదు' అంది. ఎలా
పొందుతుంది. నన్ను ఆ దృష్టితో చూడకుండానే... అసలు ప్రేమ విశ్వమానవత్వం అని
తెలియకుండానే... మనసులో స్వచ్ఛత లేకుండానే...
నీవు భౌతికంగా
నాదగ్గరలేని రోజుల్లో... ఓ రోజు ఉదయాన్నే 5గంటలకు లేచి డ్యూటీకి వెళ్తే... 9
గంటలకు ఫోన్ లో 'ఒక్కదాన్ని రూమ్ లో ఒంటరిగా వదిలేలి వెళ్లావే...' అని
అడిగావు. ఆత్మల ఐక్యంతో నిండిన నిజమైన ప్రేమ భౌతికంగా దూరంగా ఉన్నా మనసులు
కలిసే ఉంటాయి. అని రుజువైన రోజు అది. అలాంటి మన జీవితాల్లో ఎన్ని...
ఎన్నెన్నో...
గుర్తులు, ఇంద్రధనుస్సులోని రంగుల్లా మెరుస్తూనే
ఉన్నాయి. కానీ తర్వాత ప్రకృతి సహజంగా వాన వచ్చి చెరిపేస్తుంది. మీ నాన్నను
ధిక్కరించిన రోజులు, నాలో ఏకమై నిద్రనుకూడా దూరంగా తరిమేసిన గడియలు...
వానలో తడిసి ముద్దై... విచ్చిన గులాబీల్లా నవ్వుకుని తమకంతో దగ్గరైన
క్షణాలు... ప్రేమలు... ప్రేమ.. ప్రే.
ప్రేమంటే సినిమాలు, బైక్
పై రైడింగులు, పబ్ లో తాగటాలు, డిస్కోథెక్ లు, షాపింగులు... అంటూ సహజమైన
ప్రకృతికి దూరమవుతూ ప్రేమికుడు, ప్రియురాలు డబ్బులో ప్రేమను
వెతుక్కుంటున్నారు. సంతోషానికి, సుఖానికి తేడాని గుర్తించలేక పోతున్నారు.
అవసరానికి, కోరికకు మధ్య భేదాన్ని మర్చిపోతున్నారు. ప్రేమ ఓ సహజాతం. సహజమైన
మానసిక, శారీరక క్రియ. ఓ నూతనోత్తేజం. తపించే హృదయరాగం. దానిని బిజినెస్
చేస్తే... ఏమో... ఏమో... నిన్నంతా నీవు కొనిచ్చిన చొక్కానే ... నా
శరీరాన్ని బంధించి ఉంది. నీ చేతుల్లో చిక్కి అలసి సేదతీరిన నా దేహంలా... నీ
హృదయకాంతిని నాలోకి నింపుతూనే... ఈ మానసిక క్షోభ నుంచి బయటపడటానికి...
మాత్రమే... ఈ నాలుగు అక్షరాలు... నీవు లేని ప్రంపంచాన్ని దూరంగా
నెట్టివేస్తూ... ఎప్పటికీ నాలోకిన నేను ఆత్మావలోకనం చేసుకుంటూనే...
-ఎప్పటికీ
నీ
No comments:
Post a Comment