Friday, 4 July 2014

నిశీథి వీచిక


కరిగే చీకటి మధ్య
       నిలువునా కూలుతున్న దృశ్యాన్ని
 
నిట్టూర్పుల్తో ఏకాంతాన్ని సైతం
        విచ్చిన్నం చేసుకుంటున్న జీవితాన్ని
 
రగులుతున్న చితుల మధ్య
         కుంగి పోతున్నఅదిభౌతిక చర్యని
 
ఏ ఆచ్ఛాదనా లేని మనసుకు
        ఆనవాలుగా శరీరాన్ని చూపలేని స్పర్శని
 
ఒక్క ఓదార్పు కోసం
          జారని కన్నీటి బిందువు చారికని
 
జారుతున్న కుంతలాల మధ్య
         గుండెతడిలేని చీకటి చంద్రికని
 
ఎన్నో నిరాశుల మధ్య
          చుక్కానిని వెతుక్కోలేని ద్వీపాంతర వాసిని
 
అసలు ఎప్పుడో...
 నాకు నేనుగా కాలం పొరల్లోకి
           వలసెళ్లిపోయిన నిశీథి వీచికను


No comments:

Post a Comment