Saturday, 26 July 2014

ప్రేమ చిననుకుల జ్ఞాపకం

                                                 
ధారాపాతంగా వర్షం కురుస్తుందిరా...! ఆకాశం నుంచి అప్సరసలెవరో పూలు కురిపిస్తున్నట్లు...! వానాకాలం నాటి సాయంత్రాలు...! ఎన్ని అనుభూతుల్ని మిగిల్చాయో నీ నుంచి నాకు...! సన్నటి తువర మధ్య వెచ్చటి నీ శరీరపు వాసనతో రోడ్ పై నడుస్తుంటే...! ఎంతమంది విచిత్రంగా చూసే వాళ్లో...?! వీరిద్దర్ని వర్షం తడుపుతుంది కదా...? ఎందుకు పట్టించుకోవడం లేదు అని. అయినా.., వర్షం అంటే నీకు అంత ఇష్టం ఎందుకో, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ప్రకృతిలోని అందమైన దృశ్యాలన్నీ పూర్వజన్మవల్ల నీలో అనుభూతులుగా మిగిలాయోమో...! తెల్లటి నీ శరీరం ఎర్రటి చుడీదార్ లో తడిస్తే...! పక్కనున్న నాలో కవిత్వం ముక్కలై పూస్తుంటే...! నువ్వు ఎంత బలవంతం చేసే దానివి కవిత్వం చెప్పొద్దు, చెప్పొద్దు అని, అయినా ప్రవాహం ఆగకపోతే చివరకు 'నీ కవిత్వమే నేనైనప్పుడు నీకు ప్రత్యేకంగా కవిత్వం ఎందుకురా?' అని గోముగా తిట్టేదానివి. దాంతో మౌనంగా నిన్ను, వర్షాన్ని, వర్షంలో నిన్ను చూస్తూ అలా ఉండిపోయేవాడ్ని.
  
      నీకు గుర్తుందా...? ఒకరోజు రోడ్ పై వర్షంలో ఇద్దరం నడుస్తువ్నాం. వర్షం విపరీతంగా పెరిగింది. గానుగ చెట్టుకింద ఒదిగి నిలబడ్డాం. నీ నుంచి వెచ్చనైన ఉచ్చ్వాసలు, ఆ చల్లదన మధ్య బరించలేని వేడి. ముంగురులు నీ ముఖం మీదకు వాలి ముత్యాల్లాంటి చినుకుల్ని రాలుస్తున్నాయి. నీ అధరాలు తడిసిన లేత గులాబీల్లా గాలికి స్పందిస్తున్నాయి ప్రకృతిలోని సౌందర్యమంతా నీలో కుమ్మరించినట్లు...!
  
       'ఇప్పుడు ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిదో' అన్నది ఓ కవయిత్రి. కానీ నా గుండెలో నిశ్శబ్దంగా కురుస్తున్న ఈ వాన మాత్రం నీదే... ఏం చెప్పను, ఎం చేయను. పదేపదే గుర్తుకు వస్తావు. నీవు లేకుండా వర్షం వచ్చినందుకు తిట్టాలనిపిస్తుంది ఈ వర్షాన్ని. 'అయినా మనలాంటి ప్రేమికులెవరో ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటార్లే' అని నాలో నేనే సంతోషపడతాను. ప్రకృతిని చూసి, లీనమై, లయమై దానిలో ఆనందాన్ని పొందేవాళ్లు తగ్గిపోయారు. అంతా ఇంటర్నెట్..., ఫబ్ లు, కుత్రిమమైన లైట్స్... యాంత్రిక సౌందర్యం కోసం వెంపర్లాడుతున్నార్రా...!. ఇలాంటి వాళ్ల మధ్య ఈ సాయంత్రం ఓ ఒక్క జంటైనా వర్షానుభూతిని అనుభవిస్తూ ఆ సౌందర్యాగ్నిలో భస్మమవ్వక పోతారా...!? అనుకుంటాను.
   
     నంగనాచిలా వర్షం ఆగిపోగానా తెలిమబ్బులతో ఆకాశం సిద్ధమైంది... రాలిన చినుకుల జ్ఞాపకాల్ని నెమరువేసుకోడానికి. ఈ మధ్య ఒకరోజు వర్షంలో టీ తాగుతుంటే... 'వర్షంలో తడుద్దామా...?' అని అడిగింది స. సరే అని ఇద్దరం పిచ్చిగా తడుస్తూ రోడ్ పై జారే ప్రవాహంలో పాదాలను అభిషేకిస్తూ చాలాదూరం నడిచాం. ఎందుకో అనుభూతి, అంటే ఫీల్ లేదు. ఉండదని ముందే తెలుసు. ఆమెదో విరాగి బ్రతుకు. తనకుండే అహం నుంచి మాట్లాడుతుంది. డబ్బు, దర్పణం, కులం... ఏవో ఈ సమాజం మనకు బదిలీ చేసిన పాతచింతకాయ పచ్చడిలోంచి మాట్లాడుతుంది. అయినా అవవ్నీ ఎప్పుడో నేను వదిలేశానని తనకు తెలియదు కదా...! ప్రేమంటే... ఇవ్వడం. ప్రేమంటే... కోల్పోవడం. ప్రేమంటే... మన హృదయానికి మనమిచ్చే అద్భుతమైన కానుక. ప్రేమంటే... మనల్ని మనం అర్పించుకోవడం. 'దేవుడా నీకు లంచమిస్తాను. నా కోరికలు తీర్చు' అనే ఈ పాడు లోకానికి ప్రేమ గురించి చెప్పడం వేస్టే...! అనిపించింది. వర్షంలో చాలాసేపు సుబాబుల్ చెట్లకింద కూర్చున్నాం. అనుభూతుల్లేని జీవితాల్లా... ప్రకృతి వికర్షించిన సునామీల్లా... ఆమెను సమాధాన పరచడానికి చాలా శ్రమించాను. ఓడిపోయాను. 'చాలామంది అమ్మాయిలు అంతేరా గోడలు కట్టుకొని, అద్దాల్లోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ భయపడుతూ, తిడుతూ... అలా అలా... అంతే' అన్నావు చూడు నీ మాటలు అక్షరాలా నిజం. స తో మాట్లాడినప్పుడు నిజమని తెలిసిపోయింది. తర్వాత నేనెప్పుడు అంతగా మాట్లాడటానికి ఆమెకు అవకాశం ఇవ్వలేదు.
  
    ఇదిగో అక్షరాలు ఇలా వెళ్తున్నాయా...! వానలో తడిసిన నువ్వు ఈ అక్షరాల్లో ఒదుగుతున్నావు. నా గుండెను తడిచేస్తున్నావు. ఆ తడి నా కళ్లల్లో... చినుకులుగా కురుస్తుంది. ఇప్పుడు నువ్వుండే చోట కూడా వర్షం కురుస్తుందా...? తడుస్తున్నావా...?! ఆ సంతోషంలో నీ మల్లెల నవ్వును ఆరబోస్తున్నావా...!!!
 
                                                                                 జ్ఞాపకాల పుటలో ఓ వాన

No comments:

Post a Comment