Tuesday, 2 September 2014

అలల కల్లోలాల మధ్య


నీ జ్ఞాపకాల పూలల్లోంచి ఒడ్డున పడక చాలా కాలమైంది. నీ కురుల ఆకాశంలో నక్షత్రాల వెలుగుల్ని ఆశ్వాదించక చాలా రోజులైంది. నీ నడకల హొయలలో నేను అనుభూతి చెందక చాలా క్షణాలు వెళ్లిపోయాయి. నీ లే నడుమొంపుల్లో సేదతీరక యుగాలు గడిచిన జ్ఞాపకం. ఇంతకీ ఎలా ఉన్నావు నా హృదయ జలపాతమా... నా అనుభవాల ఎడారి ఒయాసిస్సా. కాలం మారింది. మనుషులు మారారు. మానవత మారింది. సున్నితత్వం, శాశ్వతమైన ఆనందం కనుమరుగయ్యాయి. కనులు పొడుచుకున్నా ఒక్క లేత ప్రేమ కిరణం పొద్దుపొడవటం లేదు. ఆకాశ హర్మ్యాలలో కత్తుల మనసులు నాట్యాలు చేస్తున్నాయి. కోర్కెల ఆశల్లో మనిషి ధనం చుట్టూ ప్రహరా కాస్తూ ప్రేమని భ్రమించి చస్తున్నాడు
 
        ఎన్ని చెప్పేది నా హృదయ నేత్రమా... నీకేం నీ యాత్ర ముగించుకొని ఆనందంగా వెళ్లి పోయావు. నీ పుటల్లో అక్షరాన్నైనేను నా ప్రేమ పాత్ర పట్టుకొని ఇక్కడ నీతి, నిజాయితి, విలువలు, స్వచ్ఛత కోసం భిక్షమెత్తుకుంటున్నాను. అయినా వాటిలో నాలుగు పరిమళపు మాటలు కూడా రాలడం లేదు. అసలు బతుక్కు అర్థం ఆనందం అని, అది మనస్పూర్తిగా ప్రేమించే మరో మనసులోనే దొరుకుతుందని ఈ వ్యాపార సామ్రాజ్య మనుషులకు తెలియడం లేదు. చెప్తే నన్నే ఓ పిచ్చి వాడిగా చూస్తున్నారు. నీ కోసం భిక్షమెత్తుతుంటానా..., అకారణంగా నయనాలు జలపాతాలవుతాయి. ఎక్కడన్నా నీ రుజువుల్లో లేతగుండెల్ని ప్రేమతో నింపాలని ఎదురు చేసే పరువపు పిల్లలు ఎదురవుతారా.. ఏముందిక ఏ కర్కశ హృదయమో వాటిని బలి చేసి ఉంటుంది. పాపం వాళ్లని చిరుపాపల్లా ఎత్తుకొని లాలించాలి, బుజ్జగించాలి, అనిపిస్తుంది. వారి హృదయాలు అంత పునీతమైనవి, చిగురాంకురమైనవి. బరించలేనంత ప్రేమ పుష్పాలతో వాళ్లని తడపాలనిపిస్తుంది. ఎందుకంటే నీవు ఇచ్చిన స్నేహంలో నేతడిసిన రేకుల వాసనలు నాలో చెరగని చిహ్నాలు కదా...

            కాని నిజం చెప్పనా... అలాంటి వాళ్లకి, ఆ లోగిలి నాచు బావుల గుండెలు ఇష్టమంటారు. వాటిలోనే కొలువై ఉంటామంటారు. బయటకు రమ్మన్నామా... వారికి మనసు లేదుకాబట్టి. నా శరీరం కూడా అర్పించామని చెప్పేస్తారు. కానీ ప్రేమలేని శరీరం... ఆలోచనే భరించలేనని నీకు మాత్రమే తెలుసు కదూ... ఎంతమంది కుటుంబం, భర్త, పిల్లలు, తప్పు చేశాను, ఆస్తి, ధనం, సమాజపు విలువలు, దేవుడు, కోర్కెలు, మతం... ఎన్ని పేర్లో పెట్టుకొని ప్రేమలేని మనసుల్లోంచి శరీరానికి సుఖాన్ని ఇస్తున్నారో ఈ లోకంలో. బాధేస్తుంది. మళ్లీ దానికి ప్రేమని నీ స్వచ్ఛమైన పేరును పెట్టుకుంటారు. ఆ వలయాలు, కచ్చడాలు దాటాలంటే భయం.  ఒకవేళ దాటినా బయట ఉండలేరు. అసలు రాలేరు. సమాజాన్ని ఎదిరించే ధైర్యం నేటికీ చాలామందికి రాలేదు. మరి సమాజం అభివృద్ధి చెందింది అంటే నాకు నవ్వు వస్తుంది. మనసులు ఎదగకుండా సుఖాలను ధనంలో కొనుక్కుంటే అభివృద్దా... మన క్షణాలను, మన మనో భావాలను ధనంతో, అదిచ్చే సుఖంలో కొనుక్కుంటే సరిపోతుందా...
 
          సుఖం వేరు, ఆనందం వేరు కదా... నువ్వే ఎన్ని సార్లు నీ చిరుకవితల జలతారులోంచి వినిపించావ్ నా మనసును. ఆ ఆనందంకై మనషులు ప్రయత్నించరు. ఒకవేళ ఎవరైనా పురుషుడు, స్త్రీ..., ఇద్దామన్నా, లక్షల అనుమానాలు. ఎందుకంటే వీళ్లకి కపట నాటకాలు, దొంగప్రేమలు అలవాటై పోయాయి. సరే... ఈ ప్రేమ గొడవెందుకు గానీ... నా అరుపుల అక్షరాలతో లోకం తీరు మారుతుందా... ఏ టీనేజ్ అమ్మాయన్నా... అబ్బాయన్నా... ఆలోచనల లోచనాలతో మనల్ని గమనిస్తాడా... ఈ ఆకృతుల్లో... మారని లోకంలా మారని నేను ఎప్పటిలాగే ఓ సుధీర్ఘ నరకాన్ని అనుభవిస్తున్నాను. వంద ప్రతిబంధకాల మధ్య... రోజూ నల్లటి చీకటి వలయాల మధ్య ఉరులు తీసుకుంటూనే ఉన్నాను. ఆశలేదు, నిరాశ లేదు. నిశీథి విలయం లేదు, ప్రళయం లేదు. ఈ మధ్య అసలు బ్రతకడం ఎందుకు అనే ప్రశ్న బాగా వేదిస్తుంది. గుప్పెడు గుండెను తట్టే ప్రేమ కోసం బతకాలని... నీవు చెప్పిన జవాబు. ఎప్పటికీ వెలిగించని దీపంలా నాలో నిదురిస్తుంది. నాలోకి నేను ఇంకా పరకాయ ప్రవేశం చేయలేక పోతున్నాను. సమాజంలోని మనషులతో రాజీపడలేక నాలుగు ఆలోచనల రోడ్ల కూడలిలో సర్రియలిజాన్నై మూర్ఛనలు పోతున్నాను. పోతూనే ఉన్నాను... నా మనసుకు ఇక సూర్యోదయం లేదని తెలుస్తూనే ఉంది. బహుశా అదీ కష్టమేమో.. గుండె యవనికపై ఎవరి చిత్రమూ ముద్రించ లేదు. అందుకే నీ మాటను ఇంకా వాస్తవ చిత్రంగా గీయలేదు. క్షమించు.
                 
                                                                           ఇప్పటి కింతే.
                                                                             సె(లవ్)

Saturday, 26 July 2014

ప్రేమ చిననుకుల జ్ఞాపకం

                                                 
ధారాపాతంగా వర్షం కురుస్తుందిరా...! ఆకాశం నుంచి అప్సరసలెవరో పూలు కురిపిస్తున్నట్లు...! వానాకాలం నాటి సాయంత్రాలు...! ఎన్ని అనుభూతుల్ని మిగిల్చాయో నీ నుంచి నాకు...! సన్నటి తువర మధ్య వెచ్చటి నీ శరీరపు వాసనతో రోడ్ పై నడుస్తుంటే...! ఎంతమంది విచిత్రంగా చూసే వాళ్లో...?! వీరిద్దర్ని వర్షం తడుపుతుంది కదా...? ఎందుకు పట్టించుకోవడం లేదు అని. అయినా.., వర్షం అంటే నీకు అంత ఇష్టం ఎందుకో, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ప్రకృతిలోని అందమైన దృశ్యాలన్నీ పూర్వజన్మవల్ల నీలో అనుభూతులుగా మిగిలాయోమో...! తెల్లటి నీ శరీరం ఎర్రటి చుడీదార్ లో తడిస్తే...! పక్కనున్న నాలో కవిత్వం ముక్కలై పూస్తుంటే...! నువ్వు ఎంత బలవంతం చేసే దానివి కవిత్వం చెప్పొద్దు, చెప్పొద్దు అని, అయినా ప్రవాహం ఆగకపోతే చివరకు 'నీ కవిత్వమే నేనైనప్పుడు నీకు ప్రత్యేకంగా కవిత్వం ఎందుకురా?' అని గోముగా తిట్టేదానివి. దాంతో మౌనంగా నిన్ను, వర్షాన్ని, వర్షంలో నిన్ను చూస్తూ అలా ఉండిపోయేవాడ్ని.
  
      నీకు గుర్తుందా...? ఒకరోజు రోడ్ పై వర్షంలో ఇద్దరం నడుస్తువ్నాం. వర్షం విపరీతంగా పెరిగింది. గానుగ చెట్టుకింద ఒదిగి నిలబడ్డాం. నీ నుంచి వెచ్చనైన ఉచ్చ్వాసలు, ఆ చల్లదన మధ్య బరించలేని వేడి. ముంగురులు నీ ముఖం మీదకు వాలి ముత్యాల్లాంటి చినుకుల్ని రాలుస్తున్నాయి. నీ అధరాలు తడిసిన లేత గులాబీల్లా గాలికి స్పందిస్తున్నాయి ప్రకృతిలోని సౌందర్యమంతా నీలో కుమ్మరించినట్లు...!
  
       'ఇప్పుడు ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిదో' అన్నది ఓ కవయిత్రి. కానీ నా గుండెలో నిశ్శబ్దంగా కురుస్తున్న ఈ వాన మాత్రం నీదే... ఏం చెప్పను, ఎం చేయను. పదేపదే గుర్తుకు వస్తావు. నీవు లేకుండా వర్షం వచ్చినందుకు తిట్టాలనిపిస్తుంది ఈ వర్షాన్ని. 'అయినా మనలాంటి ప్రేమికులెవరో ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటార్లే' అని నాలో నేనే సంతోషపడతాను. ప్రకృతిని చూసి, లీనమై, లయమై దానిలో ఆనందాన్ని పొందేవాళ్లు తగ్గిపోయారు. అంతా ఇంటర్నెట్..., ఫబ్ లు, కుత్రిమమైన లైట్స్... యాంత్రిక సౌందర్యం కోసం వెంపర్లాడుతున్నార్రా...!. ఇలాంటి వాళ్ల మధ్య ఈ సాయంత్రం ఓ ఒక్క జంటైనా వర్షానుభూతిని అనుభవిస్తూ ఆ సౌందర్యాగ్నిలో భస్మమవ్వక పోతారా...!? అనుకుంటాను.
   
     నంగనాచిలా వర్షం ఆగిపోగానా తెలిమబ్బులతో ఆకాశం సిద్ధమైంది... రాలిన చినుకుల జ్ఞాపకాల్ని నెమరువేసుకోడానికి. ఈ మధ్య ఒకరోజు వర్షంలో టీ తాగుతుంటే... 'వర్షంలో తడుద్దామా...?' అని అడిగింది స. సరే అని ఇద్దరం పిచ్చిగా తడుస్తూ రోడ్ పై జారే ప్రవాహంలో పాదాలను అభిషేకిస్తూ చాలాదూరం నడిచాం. ఎందుకో అనుభూతి, అంటే ఫీల్ లేదు. ఉండదని ముందే తెలుసు. ఆమెదో విరాగి బ్రతుకు. తనకుండే అహం నుంచి మాట్లాడుతుంది. డబ్బు, దర్పణం, కులం... ఏవో ఈ సమాజం మనకు బదిలీ చేసిన పాతచింతకాయ పచ్చడిలోంచి మాట్లాడుతుంది. అయినా అవవ్నీ ఎప్పుడో నేను వదిలేశానని తనకు తెలియదు కదా...! ప్రేమంటే... ఇవ్వడం. ప్రేమంటే... కోల్పోవడం. ప్రేమంటే... మన హృదయానికి మనమిచ్చే అద్భుతమైన కానుక. ప్రేమంటే... మనల్ని మనం అర్పించుకోవడం. 'దేవుడా నీకు లంచమిస్తాను. నా కోరికలు తీర్చు' అనే ఈ పాడు లోకానికి ప్రేమ గురించి చెప్పడం వేస్టే...! అనిపించింది. వర్షంలో చాలాసేపు సుబాబుల్ చెట్లకింద కూర్చున్నాం. అనుభూతుల్లేని జీవితాల్లా... ప్రకృతి వికర్షించిన సునామీల్లా... ఆమెను సమాధాన పరచడానికి చాలా శ్రమించాను. ఓడిపోయాను. 'చాలామంది అమ్మాయిలు అంతేరా గోడలు కట్టుకొని, అద్దాల్లోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ భయపడుతూ, తిడుతూ... అలా అలా... అంతే' అన్నావు చూడు నీ మాటలు అక్షరాలా నిజం. స తో మాట్లాడినప్పుడు నిజమని తెలిసిపోయింది. తర్వాత నేనెప్పుడు అంతగా మాట్లాడటానికి ఆమెకు అవకాశం ఇవ్వలేదు.
  
    ఇదిగో అక్షరాలు ఇలా వెళ్తున్నాయా...! వానలో తడిసిన నువ్వు ఈ అక్షరాల్లో ఒదుగుతున్నావు. నా గుండెను తడిచేస్తున్నావు. ఆ తడి నా కళ్లల్లో... చినుకులుగా కురుస్తుంది. ఇప్పుడు నువ్వుండే చోట కూడా వర్షం కురుస్తుందా...? తడుస్తున్నావా...?! ఆ సంతోషంలో నీ మల్లెల నవ్వును ఆరబోస్తున్నావా...!!!
 
                                                                                 జ్ఞాపకాల పుటలో ఓ వాన

Tuesday, 22 July 2014

కల... కల్పన... కళ

                                                


                                                       
ఎద వాకిళ్లు తెరిచి వెన్నెలను దోసిటపట్టిన రోజుల్లో జ్ఞాపకానికి ఇంత పదును ఉంటుందని తెలియదు. ఎదను కోస్తూ... జీవితం కత్తి అంచుపై యమపాశంలా నర్తిస్తున్నదని తెలియదు. తెలియదు పాపం తెలియదు... ఎడబాటుకు మండుటెండకున్నంత పదును ఉంటుందని నిజంగా తెలియదు. ఊహలు, ఊసులు, ఆశలు, ఆశయాలు మాత్రమే యవ్వనపు పొరిమేర్లలో గమ్మత్తుగా సంచరిస్తుంటే నీ వేడి నిట్టూర్పుల మధ్య కాలాన్ని కౌగిళ్లగా కరిగించిన రోజులకు తెలియదు. పాపం తెలియదు. తెలియదు... తెలియదు. మరణం ముందు ఊగిసలాడే గుండెను ఒడిసిపట్టి కన్నీటిలో ముంచేస్తుందని ఆరోజు తెలియదు... ప్రియా తెలియదు. నిజంగా తెలియదు. అసలు ప్రేమ జగత్తులో మరో మాయా జగత్తు ఉందన్న సత్యం తెలియదు. తెలియకపోవడం కూడా తెలియదు ఈ పిచ్చి ప్రేమ మదికి.  నీ వక్షం మీద ఆన్చిన ఈ తలలో ఇన్ని కల్లోలాలు చెలరేగుతాయని తెలియదు. నిఝంగా తెలియదు.
 
         వాడెవడో విరహం అంటా...నాతోనే నిత్యం జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ స్నేహితుడిలా ప్రాణం తీస్తున్నాడు. ఆది అంతంలేని ఈ చరాచర జగత్తుకు వాడే రాజ్యాధిపతి అట. దేవుడు, సైతాన్ రెండూ వాడేనట. నిన్ను నన్ను ఈ కాలగతిలో చక్రంలా తిప్పేది వాడేనట. ఆ రోజుల్లో హృదయం సినిమా చూసి ప్రేమదేవత ముందు మోకరిల్లిన ప్రేమికుడి గుండెనుండి వచ్చే శూలాల్లాంటి మాటలకు నే కార్చిన కన్నీరుకు లెక్కల్లేవు. ఇప్పటి నా వర్తమానానికి అది పునాది అన్న దృశ్యం తప్ప. సంతోషం అంటే ఏమిటి... ఎక్కడ దొరుకుతుంది... ఎసలు సంతోషం అనేది ఉందా... మనకు మనం కల్పించుకున్న భ్రమా... ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు. ఈ మర్రినీడల్లా సాగే జీవితానికి పరమార్థమే కాదు. అర్థం కూడా లేదేమో... సన్యాసులకూ తెలియక అలా తిరుగుతున్నారేమో... దేవుడిపై భారం వేసి మధ్యతరగతి మానవుడు ఆ ఆలోచనల నుంచి తప్పుకుంటున్నాడేమో... నిజాల్లేవు, అబద్దాల్లేవు... అంతా కల్పించుకున్న ఓ కుత్రిమ జీవిత చిత్రం. నిజమే కదా... అవును నిజం. నిప్పులాంటి దహించే నిజం.
 
           అక్షరాలు గుండెనరాలును తెంచేస్తూ నీ గుర్తులను ధారగా కురిపిస్తున్నాయి. అవి చిదుగుల్లా పొడిపొడిగా రాలుతున్నాయి. అమావాస్యరోజు కురిసే చీకటి సవ్వడిలా... స్మశానం లాంటి నిశ్శబ్దాన్ని మోస్తూ... పదాలు, వాక్యాలు. అర్థం మాత్రం నీవు వదిలేసిన దేహం మత్రమే. దెయ్యాల్లా రాత్రులు శరీరం నిండా గాయాలు చేస్తున్నాయి నీ చేతి గుర్తులను జ్ఞప్తికితెస్తూ... అయినా ప్రేమను పంచుకోడానికే కాదు. కోపంలో కసురుకోడానికీ ఓ తోడు లేకపోతే...ఎంత హాయిగా ఉంటుంది. రోడ్డు మీద మన తలమీదే ఓ నాలుగు చక్రాల వాహనం ఎక్కినట్లు, ఓ ట్రైన్ హటాత్ గా మనలోకి దూరి వెళ్లినట్లు... అవును ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమలో తాము, తమతో తాము యుద్దం చేస్తున్న ఓ సైనికుడే... ఏకాంతాలు, ఒంటరితనాలు చలినెగళ్లులా కాగుతున్న రక్తకాషారాలే... అప్పుడు ఎవరికి వారే ఓ సునామీ, ఓ బద్దలవుతున్న అగ్ని పర్వతం...
 
           ప్రపంచంలో అన్నిటికన్నా సుఖమైంది, సంతోషమైంది మరణం అట. కాఫ్కా కథలు చదువుతున్నా... జీవితం మరణం వైపు సాగే కళ అట. అవును కళ కల్పన, కల్పన కళ. కల ఓ వాస్తవానికి ప్రతీక. ఫ్రాయిడ్ ఎలా చెప్పాడో... కలల తీరాన్ని దాటే మనిషి అంతరంగాన్ని. ఆ కలల ఒడిలో మునిగిపోయే మనో తీరాన్ని. ఏడుపు గొప్ప కళ అట. ఆ కళ అందరికీ చేతకాదట. అవును నేను నిజంగా ఆకళలో నిరక్షరాస్యుడ్ని. ఎడుపు నా కళ్లనుండే కాదు, నా గుండె నుండి కూడా వెళ్ళిపోయింది. నిషేధం విధించింది నాపైన... మనస్ఫూర్తిగా ఏడిస్తే భారం తగ్గుతుందట. ఏడవకు అని మాట తీసుకొని వెళ్లి... ఏడుపునే నాకు దూరం చేశావు.
 
            ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలులేవు. మబ్బుల్లేవు. మానవత్వం లేదు. మనో నేత్రం విప్పే మనుషులు లేరు. నేను ఇక్కడో వలస జీవిని. ఎదస్పర్శలన్నీ ధనంలోకి కుదించబడ్డాయి. ఐదుకు, పదికి ప్రేమలు దొరుకుతున్నాయి. వాటికి ప్రేమ అని పేరుపెట్టి శరీరాలను డబ్బుతో కొనుక్కుంటున్నారు. పెళ్లిళ్ల పేరుతో వ్యాపారం సజావుగానే సాగుతుంది. కట్నాలతో కూడా ప్రేమలు బాగానే దొరుకుతున్నాయి. ముసుగుల మధ్య జీవితాలు నాట్యాలు చేస్తు... నటిస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ నేనే.  నాలో నేను ఉప్పొంగే సముద్రం, వర్షించని నా ఎడారి కళ్లు తప్ప అంతా బాగనే ఉంది. చావుకు, బతుక్కు మధ్య గడియార లోలకంలా కొట్టుకుంటుంది నా ఎద లయ. వింటే మనసుంటే..., తట్టుకునే నీ లాంటి శక్తి ఉంటే...
 
             కాలం ఎప్పుడూ ఇంతే అకారణంగా హత్యలు చేస్తుంది. నిన్ను, నన్ను, మరణాన్ని, మన ప్రేమను... ఎన్నని చెప్పను. తగలబడుతున్న నా ఎద సాక్షిగా... ఇంకో సారి చెప్తా విను. ఇక్కడ ప్రేమలు లేవు. అవసరాలు, అవకాశాలు, కోర్కెలు, డబ్బు, హోదాలు, కీర్తి... వాటికోసం నటన. మరి నేనెలా బ్రతకాలి... నీ పాటికి నీవు వసంతాన్ని వెంటేసుకుని, నీయాత్రను ముగించుకొని అలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయావు. నాకు ఇక్కడేం పని. నే చెయ్యాల్సిన పనులు ఏముంటాయి. ఈ రక్కసి మనసుల మధ్య, ఈ వస్తువినిమయ మనుషుల మధ్య... అందుకే అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఆరిపోయిన వెలుగుల మధ్య ఆరిపోయిన కొవ్వొత్తిని ఎవరూ వెలిగించడానికి ప్రయత్నించకండి. ఈ పేజీ చించేయబడింది. ఈ పుస్తకం శాశ్వతంగా మూసివేయబడింది. దయచేసి చివరి అట్టకూడా తెరవకండి. అటునుంచి చదవాలని పిస్తుంది.
 
                                                                                                  బై.... 
ఒక జీవితకాలం... కాలం... లయం... యం.       

Friday, 11 July 2014

ఓ పిచ్చి కవిత

                  

ఏం రాయను ...?

అనంత కాంతి సంవత్సరాల తర్వాత...?
నాలో నిన్న వెతికి పట్టుకోవాలని...!
దూరాన్ని దగ్గరగా శపించుకుని
నేను గుర్తున్నానా...!?
అని నా అంతరంగపు విరహాన్ని అడిగితే...
ఏం చెప్పను...!?
చలన సూత్రాల నిండా
బుహముఖ స్వాప్నిక జగత్తును గుండెలకెత్తుకొని
నీకై... నీదై... రోదిస్తున్నా...!!!
ఏం చెప్పను...?
నీవు లేని క్షణాలలో ఎదలో రగిలిన కణాల జ్వాలాక్షరాలను
ఎలా రాయను...?
అన్వేషణ ఆఖరిపుట తిరగేస్తూ
ఒక్కో ఓదార్పు భాష్పజలమై నిరాశగా జారుతుంటే...!
ఏం రాయను...?
నాలోని నిన్ను గురించి

నేనే నీవైతే ....!!!

Monday, 7 July 2014

మీరు లవ్ ఫెయిలా... అయితే పండగ చేసుకోండి.


అసలు ప్రేమలో ఫెయిలు, పాస్ లు ఉండవు. మనం ప్రేమించడం, ప్రేమించక పోవడం మాత్రమే ఉంటుంది. మనం ఇష్టపడ్డామని అవతలి వాళ్లు మనల్ని ఇష్టపడాలన్న రూల్ లేదుకదా... అయినా ఎదుటి వాళ్లు పుట్టి, పెరిగిన వాతావరణ పరిస్థితుల్లోంచే... వాళ్ల అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటికి అనుగుణంగా మనం ఉన్నామా, లేమా అని అంచనా వేస్తారు.
 
మన మనసుకు నచ్చిన విషయాలలోంచే ఎదుటి వాళ్లను చూస్తాం. దగ్గరగా ఉంటే ఓకె అనుకుంటాం. ప్రపోజ్ చేసిన వారికి ఓకె చెప్తాం. లేదా అలాంటి వాళ్లు తారస పడితే మనం ప్రపోజ్ చేస్తాం. అసలు ప్రపంచంలో 99 పర్సంట్ లవ్ లు ఫెయిలవుతాయి. 1 పర్సంటే పాస్. బాగా చదివి యక్జామ్ రాయడం వరకే మనం చేసేది. మనం కరెక్టుగా ఉన్నామా లేదా... అనేదే చూసుకోవాలి. ఫెయల్ అయ్యామనుకో... అది ఎదుటి వాళ్ల తప్పు. మరో సారి, మరో ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలి. అంతే...
 
అసలు ప్రేమంటే... ఇది అని ఎవరూ చెప్పలేరు. అది మనసులోతుల్లోంచి అనుభవంలోకి వచ్చే అనుభూతి మాత్రమే... అది కలగా మిగలకుండా, కథగా కాకుండా జీవితాంతం సాగాలని కోరుకుంటారు. కానీ సమాజం కల్పించిన ధనం, మతం, కులం, ప్రాంతం ఇలా... అనేక అడ్డంకులతో ఆగిపోతుంది. మరో వైపు జీవితాన్ని లాగేసుకుంటుంది.
 
     అయితే ఈ మధ్య ఎక్కువమంది లవ్ ఫెయిల్యూర్స్ ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. వాళ్లలో ఎక్కువ మంది 15 నుండి 30 మధ్య వయసు వాళ్లే...
 ప్రేమ ఓ సుందర స్వప్నం కావచ్చు. ప్రేమ ఓ అద్భుత ఛేతన కావచ్చు. ప్రేమ అనుభవంలోని ఓ తీయని జ్ఞాపకం కావచ్చు. కానీ అన్నిటికీ మించినది జీవితం. జీవితంలో ప్రేమ ఓ భాగం. ఓ చిన్న వీచిక. ఓ అలమ మాత్రమే.
 
     ప్రేమ సక్సెస్ కావాలను కోవడం మంచిదే... అలానే కాకుండా ఉండటం కూడా ఇంకా మంచిది.
ప్రేమ విఫలమైతే అది మన తప్పు కాదు. ఎదుటి వాళ్లు మనల్ని అర్థం చేసుకోకపోతే అది వాళ్ల దురదృష్టం. అలాగని మనల్ని, మన జీవితాల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. వాళ్లు మన జీవితంలోకి రాకముందు చాలా జీవితం మనకుంది. అలానే వాళ్లు లేని ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఒక రైలు మిస్ అయితే మరో రైలులో వెళ్తాం. అంతేకానీ జీవిత ప్రయాణాన్ని ఆపుకోం కదా...ఆపుకోకూడదు. 
 
1. ప్రేమించినోళ్లు... నో అని చెప్పిన వెంటనే... అది మనలో మనం దాచుకోకూడదు. మన మనసుకు దగ్గరైన వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు వెెంటనే వాళ్ల ఓదార్పు దొరకి మనకు కొంత ప్రశాంతత, ఓరట కలిగిస్తుంది.
 2. దగ్గరున్న వాళ్లతో ఓ చిన్న పార్టీ చేసుకోవాలి. ఆనందం అంటే వాళ్లతోనే కాదు, ఇతరులతో కూడా పంచుకోవచ్చు అని తెలుస్తుంది. అప్పుడు అనేక మంది... వాళ్ల లైఫ్ లోని అనుభవాలు మనతో పంచుకోవటం వల్ల మనలాంటి వాళ్లు చాలామంది ఉన్నారన్నది మన ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
3. వెంటనే వాళ్లని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అందుకు మన టేస్టులను, అభిరుచుల్ని గుర్తు చేసుకొని.. ఉదాహరణకు నేచర్ ను ఎంజాయ్ చేయడం, పుస్తకాలు చదవడం, మనకున్న ఆర్ట్స్ కు దగ్గరవడం ఇలా...
4. ఇంతకు ముందు మనకు దగ్గరగా ఉన్న వాళ్లని బాగా గుర్తు చేసుకొని వాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. లేదా వీలైతే పాత ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు గడపాలి.
5. వాళ్లుమనకు పరిచయం కాకముందు మనకున్న తీయటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవాలి.
6. వాళ్ల జ్ఞాపకాలను గుర్తుచేసే వస్తువుల్ని, గిఫ్టులను దూరంగా ఉంటాలి. అలానే ఫోన్ నెంబర్ లాంటివి డిలిట్ చేయాలి.
 
                    వీటితో పాటు మనకేం తక్కువ... అనే నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ప్రపంచంలో ఒక్కరే కాదు. అంతకంటే మంచి వాళ్లు మన లైఫ్ లోకి వస్తారన్నా ఆలోచనను పెంచుకోవాలి. అసలు మనకు ఎదుటి వాళ్లు సరైన వాళ్లు కాదేమో... దూరమవడం మన మంచికే అనే తత్వాన్ని పెంచుకోవాలి. అదే నిజం కూడా... నాకేం తక్కువ అనే ఆత్మాభిమాన్ని పెంచుకోవాలి.
 
               అన్నిటిని మించి ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లైఫ్ లో బాగా ఎదిగి మనమేంటో రుజువు చేసుకోవాలి. మనకు ఎందుకు దూరమయ్యానా, అనేలా వాళ్లు ఆలోచించుకునేవా జీవించాలి. అలాంటి జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆదిశగా జీవితాన్ని నడిపించాలి. చరిత్రలో మనకూ ఓ పేజీ ఉందని రుజువు చేసుకోవాలి. ... ఇలాంటి భావాలతో అనునిత్యం జీవితాన్ని ఉత్సాహం వైపు నడపాలి. ఆచరణలో పెట్టాలి. పూర్చి పాజిటివ్ థాంట్స్ తో మైండ్ నిండిపోవాలి. మనల్ని మనం గులాబివనంలా మార్చేకుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో దేవదాసులు, పార్వతలు లాంటి జరగని కథలు కాదు కావల్సింది.   ప్రతి మనిషి జీవితంలో ఓకే ప్రేమ ఉండదు. కొన్ని ప్రేమలు ఉంటాయి. ఇదో అనుభవ సత్యం. ఇది కాకపోతే మరోటి. అది కాకపోతే మరోటి. కానీ మన లైఫ్ మనకు సత్యం. 
 
ఆల్ దబెస్ట్ లవ్ ఫెయిల్యూర్స్...
ప్రపంచం మనదే...
ప్రపంచం నిండా మనమే...
జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం...
పెయల్ లో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేద్దాం.
జీవితంలో మనమేంటే నిరూపించుకుందాం...
మన లక్ష్యాలవైపు సాగిపోదాం...
ప్యూచర్ మనదే...
మనల్ని కాదన్న వాళ్లు ఈర్ష్య పడేలా ఎదుగుదాం... 
జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభిద్దాం
                                              బై
                                మైడియర్ లవ్ ఫెయిల్యూర్స్

Friday, 4 July 2014

అలలు వదలని కడలి



దృశ్యాలన్నీ అదృశ్యాలవుతున్నాయి. ఎదలోని ఎద తనలోకి తాను మునగదీసుకొని నిద్రకు ఉపక్రమిస్తుంది. ప్రతి చర్య ప్రతిచర్యను కోరుకుంటుంది. ఆకాశం నీటిని ఇచ్చి మేఘాల ద్వారా మళ్లీ గ్రహించనట్లు. మనుషులు అసలు నచ్చడం లేదు. హటాత్తుగా ఈ మానవ ప్రపంచం గొప్ప అద్భుతమైన వనంగా మారిపోతే...! చెట్లు చేమలు. పక్షులు, జంతువులు, పువ్వులు, లేనవ్వును పూసుకునే మొగ్గలు, తొలికిరణాలను ముద్దాడే మంచు బిందువులు...! ఎంత బావుంటాయి. ఈ కాంక్రీట్ భవనాల మధ్య, మనుషుషులు, వారిలోని మనసులు పూర్తిగా  కాంక్రీట్ గానే మారిపోయాయి. నేనే మారలేక నా జ్ఞాపకాల వలలో చిక్కుకుని ఆత్మను తొవ్వుతున్నాను పగలు రేయి తేడా లేకుండా...

నిద్రకు వెలియై నేనొంటరినై అన్నాడో కవి, అవును దీనంగా నా చూపులు నన్నే ప్రశ్నిస్తున్న వేళ... సమాధానాల కోసం కొత్తదనాన్ని వెతుక్కోలేక పోతున్నా, ఆశకు అనుభవాలకు మధ్య బంధించబడి శిలాక్షరంలా ఉంటున్నా...! నీకో విషయం చెప్పనా...! భూమ్మీద సూర్యప్రతాపం ఎక్కువైంది. వానలు కనుమరు గవుతున్నాయ్. నీవు ఉంటే ఎంత భాధపడే దానివో కదా...! నీవు వర్షంలో తడుస్తుంటే... నీ నల్లటి కురుల్లోదాగలేక ఎన్ని నీటి బిందువులు నక్షత్రాలై నేలపై రాలేవో...! ఎన్ని కవితలు నీ ఆనందపు పొలిమేరల్లోంచి నా సెల్ లో ప్రక్షమయ్యేవో...! ముద్దుల మాటున జల్లులు విరిసిన క్షణాలను ఎలా మర్చిపోగలం. కాలం చెక్కిలిపై నీ అధరాల చప్పుళ్లను లిఖించలేని ఈ చరిత్ర ఎంత కోల్పోయిందో కదా...! అయినా ప్రకృతి అందాలకు మైమరచిన దేవుడు దానికి మించిన సౌందరాన్ని స్పృజించాలనే కాంక్షతో స్త్రీని ఈ భూలోకం మీద సృష్టించి ఉంటాడు. నీ దేహంలో విరిసే ఇంధ్రదనసులు, విరగే నెలవంకలు, నీలికొండల మధ్య సంద్యాసమయాలు, చిరు గరికలై విచ్చే లేలేత పాదాల రవళులు, వన్నెలపువ్వులై విరిసే నవ్వుల పువ్వులు, పవిత్రమైన పూజకోసం పుష్పించే మొగ్గల వేళికొసలు, నడుమొప్పుల్లో దాగిన లతా మణులు... ఎన్నని చెప్పను.!
 
గతకాలపు ప్రేమ పుటలు నీ ప్రేమని నింపుతంటే.., ప్రస్తుతం, కన్నీరై అక్షరాలను అభిషేకిస్తుంది... ప్రియా...! ఆనందం లేదు, ఆత్మతృఫ్తి లేదు, అరమరికలు లేవు, అభిషేకాలు లేవు, ఆలింగినాలు లేవు, అనురాగాలు లేవు, ఆత్మీయ స్పర్శలు లేవు, వెచ్చటి దేహంలో కాంతి పరావర్తనం చెందే క్షణాలు లేవు. వదలలేని నిశ్వాస తాళ వృంతాలు లేవు. ఘనీభవించిన రెండోజాము చీకటి పెళ్లలు తప్ప. ఇంకా భయం, చేదులాంటి భయం, తీపి లాంటి భయం... తీపికి చేదుకు మధ్య విరక్తి చెందే రుచిలేని భయం. అందుకే... మనుషులకు దూరంగానే ఉంటున్నాను. ఎదను కాల్చే వెలుగులో నాకునేను చలి కాచుకుంటున్నాను. ఆ చలిలోంచే ఈ వాక్యల విస్పోటనలు. ఎప్పటిలాగే మానవ ప్రపంచానికి అంటీ అంటనట్లు బతుకుతున్నాను. ఇమడలేని మనుషుల మధ్య మేఘాల మధ్య సూర్యుడిలా  కాలుతూ తిరుగుతున్నాను. ఏమీ తోచదు. నిస్తేజం. నిస్పృహ.
 
నీలిలిట్మస్ కాగితాల మనసుల మధ్య ఏ దరికి చేరాలో తెలియదు. ఈ ప్రపంచానికి ఓ సృష్టికర్త ఉన్నాడు అంటారు. నిజంగా ఉంటే... ఈ మనుషుల మీద జాలి, దయ లేకుండా ఎందుకిలా తయారు చేస్తున్నాడు. ఆ దేవుడు కూడా మనిషిలానే ప్రేమ లేనివాడా... ఏమో...! నీవు అన్న ఓ మాట ఎప్పటికీ ఏ సత్యం... నీ నోటి నుంచి నే విన్న నీ భక్తి శ్లోకాలవలే...
 
నేనెప్పుడూ నీతోనే ఉంటా... నీ లోనే ఉంటా..
అంత ప్రేమ సాధ్యం కాదురా అంటారు ఈ మనోవృద్ధులు. శరీరాలు, ధనంలో సుఖాన్ని వెతుక్కునే అల్పజీవులు. ఎందుకు బతుకుతున్నామో తెలుసుకోలేక. సృష్టిలోని బంధాలన్నీ ఇంతే అనుకుంటారు. అల్ప మనుషులు, అల్ప సంతోషాలు. వీళ్లకు ప్రేమించడమే కాదు, ప్రేమించహబడమూ తెలియదు. రాదు అనుకుంటాను. కొద్ది గా వర్షంలో తడిసి, అబ్బా... తడిసి పోయాను, అని ఆరబెట్టుకునే మనుషులు. అహాన్ని ఎలా వీడతారు. నాది అనే భావనలోనే చిక్కుకొని దానిలోనే అందరిని కుదించి చూస్తారు. ఒక్కసారి బైటకు వస్తే ఎంత ప్రేమమయం. మనిద్దరిలా ఈ లోకం. ఎంత సుఖం... ఆత్మపరమాత్మల సంయోగంలా... నీలా నాలా...
 
ఈ సాయంత్రం గాలి చల్లదనాన్ని పూసుకొని వీస్తుంది. ఇన్ని పరవాల శరీరాలలో ఒక్కరైనా దాని తాకిడికి స్పందించక పోతారా... వేటూరి అన్నాడు పరువానికి బరువైన యువతీ... ముందు నువ్వు పుట్టి తర్వాత సొగసు పుట్టీ... మొదటి వర్ణన దేహానికైతే, రెండోది ఆత్మకని నా భావన. ఈ మధ్య రవీంద్రుడి  గీతాంజలిని మరోసారి చదువుతున్నా... ఎవేవో కొత్తతెరలు నాలో లేస్తున్నాయి...! నీ కవితల్లో... నిండిన నా పూరణలే గుర్తుకు వస్తున్నాయ్. ఒక్కటి మాత్రం నిజం ప్రియా...! మనసు పుష్పించినప్పుడు, ప్రేమ అంకురించినప్పుడు, విషాదం విరహమై దావానలంలా మనలో రేగినప్పుడు... తప్పక కవిత పూస్తుంది. నీవన్నీ భావాల్లో తేలిన పారిజాతాలే... వాటిలో నిండిన నా మనసుది ఒక జీవితకాలం చాలని ప్రేమ... ...
 
అలలే సముద్రానికి అలంకరణ, నీ జ్ఞాపకాల మత్తే నాలో ఆ అలల పునరుత్పత్తి.
ఎవరో అన్న గుర్తు...
                       కెరటం నా ఆదర్శం     
                       లేచి పడినందుకు కాదు
                        పడినా మళ్లీ లేచినందుకు.
                                                 ----  అలల భాషతో

నిశీథి వీచిక


కరిగే చీకటి మధ్య
       నిలువునా కూలుతున్న దృశ్యాన్ని
 
నిట్టూర్పుల్తో ఏకాంతాన్ని సైతం
        విచ్చిన్నం చేసుకుంటున్న జీవితాన్ని
 
రగులుతున్న చితుల మధ్య
         కుంగి పోతున్నఅదిభౌతిక చర్యని
 
ఏ ఆచ్ఛాదనా లేని మనసుకు
        ఆనవాలుగా శరీరాన్ని చూపలేని స్పర్శని
 
ఒక్క ఓదార్పు కోసం
          జారని కన్నీటి బిందువు చారికని
 
జారుతున్న కుంతలాల మధ్య
         గుండెతడిలేని చీకటి చంద్రికని
 
ఎన్నో నిరాశుల మధ్య
          చుక్కానిని వెతుక్కోలేని ద్వీపాంతర వాసిని
 
అసలు ఎప్పుడో...
 నాకు నేనుగా కాలం పొరల్లోకి
           వలసెళ్లిపోయిన నిశీథి వీచికను


Friday, 27 June 2014

'మన'సుకవి ఆత్రేయ

 

తెలుగు సినిమా పాటకు మనసు తడిని అద్దిన కవి ఆత్రేయ. మనోలోతుల్ని అక్షరాల్లో రంగరించి ప్రతి గుండెకు పాటల రూపంలో అందించిన మనస్వి. నాటకాలతో ప్రజాచైతన్యానికి బాటలు వేసిన అభ్యుదయవాది. అలతి పదాల్లో అనల్పార్థాన్ని నింపిన భావకుడు. తెలుగుతెర వెండి పాటల్లో చందమామలా ప్రకాశించే సూర్యుడు ఆత్రేయ.
 
      ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడులో మే7, 1921ల జన్మించాడు. చిన్ననాడే తల్లి మరణించింది. వీరిది ఆత్రేయ గోత్రం. అందుకే పేరును గోత్రంతో కలిపి ఆచార్య ఆత్రేయ అని పేరు పెట్టుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాటకాలమీద మోజుతో చదువుకు స్వస్తి పలికాడు. ఆ పైన టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశాడు. లేఖకునిగా, గుమస్తాగా, పత్రికా సంపాదకునిగా ఉద్యోగాలు చేసి... చివరకు సినీప్రపంచంలో స్థిరపడ్డాడు.
 
        పాటల రచయితగానే కాకుండా ఆత్రేయకు నాటక రచయితగా గొప్ప పేరుఉంది. ఎన్.జి.ఓ., ఈనాడు నాటకాలు రచించి ప్రదర్శనలు ఇస్తూ ఆనాటి ఆంధ్రదేశం అంతా పర్యటించాడు. 1949లో 'ఎన్జీవో' నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. అటుపై హ్యాట్రిక్ కూడా సాధించింది. విశ్వశాంతి, కప్పలు, భయం, బలిదానం, ఒక రూపాయి, తెరిచిన కళ్లు... లాంటి సుమారు 15 నాటకాలు నేడు అందుబాటులో ఉన్నాయి. ఆత్మకథను 'తొలిగాయం' పేరుతో పద్యరూపంలో రాశాడు. వీరి రచనలు మొత్తం 9 సంపుటాలుగా మనస్విని సంస్థ ముద్రించింది. అంతేకాదు ఆరోజుల్లో ఆత్రేయ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆర్నెళ్లు జైలు శిక్షకూడా అనుభవించాడు. తర్వాత క్రమంగా కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితుడయ్యాడు.     
 
           1951లో విడుదలైన 'దీక్ష'చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సుమారు 400 సినిమాలకు, 1400 పాటలు రాశాడు. ఆత్రేయ తన పాటల్తో మనసుకు కొత్త భాష్యాలు చెప్పాడు. మనసులోని భావాల్ని, అంతరంగ లోతుల్ని, పొరల్ని విడివిడిగా తన పాటల్తో అల్లారు. ఎటువంటి శబ్దడాంబికాలు లేకుండా నిర్మలగంగా ప్రవాహంలాగా సరళమైన పదాలతో పాటలు రాశాడు. ప్రజల మాటల్నే పాటలు చేశాడు. రాశాక తన పాటల్నే మాటలు చేశాడు. అత్రేయ చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం అవడం వల్ల ఆ ప్రేమ మాధుర్యాన్ని అమ్మపై రాసిన పాటల్లో కురింపిచాడు. 'అమ్మంటే అమ్మ, అనంత సృష్టికి ఆమే అసలు బ్రహ్మ' (రామ్ రాబర్ట్ రహీం) అన్నాడు. 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నోతెలియని మమతల మూట' (బుల్లెమ్మ-బుల్లోడు) అని కూడా వర్ణించాడు.
 
         ఇక ప్రేమ గురించి, ప్రేమికుల గురించి, ప్రేమలోని ఆనందం, విషాదం, విరహం, బాధ, ఒంటరితనం గురించి ఎన్నో పాటలు అద్బుతంగా అందించాడు. అసలు ఆత్రేయ జీవితంతోనే ప్రేమ అనే పదం ఆడుకుందేమో అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే... స్కూలు ఫైనల్ చదివేటప్పుడు పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించి, ఆమెకు దూరమయ్యాడు. ఆలా తొలిగాయం నుంచి ఆత్రేయ కోలుకోకుండానే ప్రేమకోసం తపించి ఎన్నో అనుభవాలను, వైఫల్యాలను పొందాడు. అవే ఆయన పాటల్లో మనకు దొరుకుతాయి.
 
             స్త్రీని ఉద్దేసించి 'ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు, ఆడుకున్నా ఫర్వాలేదు పగలగొట్టి పోతారెందుకు' (ఆడబ్రతుకు) అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు 'ఓ హృదయం లేని ప్రియురాలా... రాయికన్న రాయివి నీవు, కసాయివి నీవు' (కన్నె వయసు) అని నిందిస్తాడు. ప్రియురాలి ప్రేమకై తపిస్తూ 'నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది' (ఇంధ్రదనస్సు) అంటాడు. ప్రేమించి విఫలుడైన ప్రియుడి గురించి 'మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మసున్న మనిషికి సుఖము లేదింతే '(ప్రేమనగర్) అని విరక్తి చెందుతాడు. 'మనిషికి మనసే తీరని శిక్ష' అని నిర్ణయానికి వచ్చేస్తాడు.
 
           పవిత్రమైన ప్రేమికుల గురించి చెప్తూ 'మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెపుడో కలసి పోతది' (మూగమనసులు) అంటాడు. పైగా అదే చిత్రంలో 'మనసు మూగదే కాని బాసుంటది దానికి' అని మనోభాషని నిర్వచిస్తాడు. 'మనసుతోటి ఏలాకోలం ఆడుకోకూడదని' విజ్ఞప్తి చేస్తాడు. 'మనసు లేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు' (ప్రేమలు-పెళ్లిళ్లు) అని ఆ దేవుడ్నే నిందిస్తాడు. ప్రియురాలికి దూరమైన ప్రేమికుడి బాధను చెప్తూ 'ప్రేమఎంత మధురం, ప్రియరాలు అంత కఠినం... ప్రేమలేదని ప్రేమించ రాదని' (అభినందన) అంటాడు. ఇక ఆత్రేయను మనసుకవిగా నిలిపిని పాట 'మౌనమే నీబాస ఓ మూగ మనసా...' (గుప్పెడు మనసు) దీనిలో మనసును ఉయ్యాలగా, దయ్యంగా, చీకటి గుహగా, కూరిమి వలగా... ఎన్నో ప్రతీకలతో విశ్లేషించాడు.
 
           ఆత్రేయ కేవలం మనసు పాటల్నే రాయలేదు. వలపు పాటలు, జీవితాన్ని తర్కించే పాటలు, ప్రేమ గీతాలు, జానపద గీతాలను... కూడా సరికొత్త హంగులతో రాశాడు. 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధమూ' (జీవన తరంగాలు) అని మానవ సంబంధాలు చావుకు అతీతం కాదన్నాడు. 'కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చానా నీ బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా... నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాటిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరను తెలుసుకో' (తోడికోడళ్లు) అని పాటలో సామ్యవాదాన్ని ప్రకటించాడు. 'కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా... అన్నా, చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నదానా...' అన్నా ఆత్రేయకే చెల్లింది. 'శేష శైలావాసా శ్రీ వెంకటేశ' అని ఆ ఏడుకొండల వాడిని వేడుకున్నాడు. 'అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం, మమతన్నది ఒట్టి పిచ్చి, మనసన్నది మరో పిచ్చి' (అంతులేని కథ) అని లోకం రీతిని ఎండగట్టాడు. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే...' (ఆత్మబలం) అని తెలుగు తెరపై తొలిసారిగా వాన చినుకుల్ని, వలపు పలుకుల్ని కలిపి రాశాడు.
 
           ఆత్రేయ కేవలం మాటలు, పాటలు, నాటకాలు మాత్రమే రాయలేదు. దర్శకత్వం వహించాడు, నిర్మాతగా కూడా చిత్రాలు నిర్మించాడు. అన్నిటికీ మించి 'నీలిమేడ' అనే కథ కూడా రాశాడు. ఈ కథ 1946 జూలై 'భారతి' పత్రికలో ముద్రితమైంది. ఇలా ప్రేక్షకుల మనసుపై మనసుకవిగా ముద్రపడిన ఆత్రేయ సెప్టెంబరు13, 1989లో మరణించాడు. ఆయనే చెప్పినట్లు 'మనసు పోతే మాత్రమేమి మనసు ఉంది'. ఆయన పాటలు మన మనసుల్లో పదిలంగా ఉన్నాయి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆ పాటల్లో వెదుక్కునేలా చేస్తున్నాయి. చేశాయి. చేస్తాయి.  

Thursday, 26 June 2014

చిరునామా లేని లేఖ


       ఎన్ని ఊహలు మనిషిని  నాశనం చేస్తాయో కదా...! అన్నీ అంతమై పోయాక...! నీకోసం నా కలల లోగిలిలో ఓ స్వప్న సౌధాన్ని కట్టాను. ఆకాశానికి భూమికి మధ్య నువ్వూ, నేను మాత్రమే జీవించగల ప్రదేశమది...! నీ నవ్వుల్ని నక్షత్రాలుగా మార్చి ఆ ప్రదేశమంతా వెలుగుల్ని పూయించాను.నీ శరీర కాంతినే సంధ్యకు అలిమి మన ఏకాంతంలో సాంధ్యరాగాన్ని ఆలపించాను. అప్పుడు సుదారాల్లోంచి, పక్షుల కిలకిల శబ్దాల్లోంచి సుతిమెత్తగా షెహనాయ్ మంద్రంగా వినిపిస్తోంది. అక్కడ నువ్వు నేను, సృష్టి సౌందర్య పరిమళం... ధారాపాతంగా కురుస్తున్న వెన్నెల సోన... నేను మాత్రం స్పర్శకు గాఢంగా నిశ్శబ్దాన్ని నేర్పుతున్నాను.
        
         హటాత్తుగా కళ్లు తెరిస్తే... ఏముంది నా ముందు చీకటి...! నా చుట్టూ చీకటి... నా లోపల చీకటి... చీకటి... చీకటి... ఫెటిళ్ళమనే చీకటి.
 
    ఏం చెప్పను... ?నువ్వు దూరమైన రోజు నుంచీ ఈ స్వప్నాలు సైతం నన్ను వేధిస్తూనే ఉన్నాయి. ఉరితాళ్లలా మారి నా గుండెనే ఉరి తీస్తామంటున్నాయి. ఆ గుండె నిండా ఉన్నది నీవేగా...! నీ జ్ఞాపకాలేగా...! వాటినీ కోల్పోయి నేనెలా బతకగలను..? ఆఖరకు ఆ కలల్లో కూడా నిన్ను చూసుకునే బాగ్యానికి దూరమవుతానేమో...!!?
        
          అయినా...! దూరమనే శిక్ష ఇంత బాధను నింపుతుందా...? అసలు ప్రేమంటేనే శాశ్వత వ్యధేమో కదా...! దూరంగా ఉన్నంత సేపూ దగ్గరవ్వాలని, దగ్గరగా ఉన్నంత సేపూ దూరం కాకుడదనీ... బాధ. శాశ్వతంగా దూరమైతే.,.!? ఇలా...! నాలా...!
 
       ఇప్పుడు నీ గురించి ఏవో కొన్ని అనుభవాలు, అనుభూతులు రాయగలుగుతున్నాను గానీ, పది నిముషాలు గడిస్తే...! నా వల్ల కాదేమో...! ఎందుకంటావా...? ఇట్లానే నా గుండెలోంచి ఏకంగా ఈ అక్షరాల్లోకి దూకేస్తావు. ఇక కాగితం నీ ఆకారంతో నిండిపోతుంది. నా కళ్లు పూర్తి నిమీలితాలవుతాయి. హృదయం బరువెక్కుతుంది. మౌనంగా మారిపోతుంది. అప్పుడు ఇక నానుంచి నేను దూరమవుతాను. మానసికంగా నీలో లీనమవుతాను. అప్పడిక నేనే నువ్వు, నీవేనేను. సృష్టిలో తొలి పరిచయం మనదే కదా...!! ఆ క్షణాల్ని ఎవ్వరితోనూ పంచుకోవాలని ఉండదు. ఏకంగా నాలోనేను మిగిలి, కిమిలి పోవడం తప్ప...!?
 
       ప్రేమకు... మనిషికి... మనసుకు మధ్య ఈ బంధాల్ని పూర్తిగా విడమరిచి ఎలా చెప్పాలో నాకు ఇప్పడికీ తెలియడం లేదు. కవిత్వాలు, తత్వశాస్త్రాలు వివరించలేదు, బోధించలేదు. అదో ఆంతరంగిక సౌందర్యానికి పరాకాష్ట అయిన వ్యధా చిత్రమేమో...! ఏ చిత్రకారుడూ చిత్రీకరించలేక పోయాడు. అయినా.. ఆస్తి, ధనం, దేహం, వస్తు విపణిలో చిక్కుకున్న ఈ పాడు ప్రపంచానికి చెప్పినా అర్థం కాదు...!! బహుశా ఆత్రేయ గారిని అడిగితే బావుణ్ణు...
     "మనిషి జన్మనిచ్చి మనసు వ్ఫ్చ్చితివయ్యా...
     ఇంతకన్న ఏమికావలియు శిక్ష" అని దేవుడ్నే ప్రశ్నించాడు. నీవు ఎన్ని చెప్పినా నేను దేవుడ్ని నమ్మనన్నప్పుడు... నీకు వచ్చిన కోపం ఇంకా నామదిలో పదిలంగానే ఉంది. గమ్యం సినిమాలో...
      "ప్రేమను ప్రేమించే ప్రేమ
       ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది..." అన్న
 వాక్యాలు నా గుండెను మరోసారి గెట్టిగా చరిచాయి. మరి నా జీవితంలో ఎందుకలా జరగలేదా అని...! అది సినిమా కదా...!!
     
        అసలు ప్రేమకు మరుపనేది ఉందా అని...?ఉంటే...! సృష్టి ప్రారంభం నుంచి ఇన్ని శరీరాలు, ఇన్ని ఆత్మలు, ఇన్ని హృదయాలు దానిలోపడి భగ్నమై... చివరకు బూడిదై... ఓటమిపాలై... ఇలా ప్రేమను బాధించేవి కావేమో కదా...
 
     రోజులు నాకు మౌనంగా భారంగా దొర్లుతున్నాయి. క్షణం క్షణం... నీ అధరం నుంచి వెలువడే చిరునవ్వులో కాలి బూడిదై పోవాలనే తపన. నీ ఎదురుగా నిన్నే చూస్తూ... నీ మాటల్లో మునుగుతూ... కాలాన్ని కాంతివంతంగా గడిపిన రోజులన్నీ మెదులుతున్నాయి. నువ్వు చెప్పినట్లే జీవిస్తున్నా మరణిస్తూ... నీ మాటల్ని గుర్తు చేసుకుంటూ... ఇష్టం లేక జీవితాన్ని భరిస్తూ... కొన్నిటిని ఎవరితోనూ పంచుకోలేం కదా...!  వాటిని బతుకు చివరవరకు గుండె కొసన మోయాలి. నీ జ్ఞాపకాలకున్న శక్తి అటువంటిది మరి. నువ్వన్న మాట ఈ క్షణానికీ గుర్తొస్తుంది... "మరీ అంత సున్నితంగా మనసు ఉండకూడదురా...?" ఏం చేయమంటావు...? నాకు చేతకావండ లేదు. నా మనసుకు మరోలా ఉండలేదు. క్షమించు ఇప్పటికి మాత్రమే... 

Monday, 23 June 2014

అనుభూతుల ఎడారితోట



                                            

        
'నిన్ను వదిలి వెళ్లాలని లేదు... అని నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చకు' అని మాట తీసుకున్నావు.
శాశ్వతంగా నీలోనే ఉంటానని ఒట్టేశావు. అది నిజం. జ్ఞాపకంగా, యదార్థంగా ఇప్పటికీ నన్ను కౌగిలించుకునే ఉన్నావు. ఉంటున్నావు. నమ్మకం ఓ గాఢమైన అనుభూతి మాత్రమేనా...!! ఆ రోజు వదిలి వెళ్లడానికి అంత బాధపడ్డావు. కానీ ఈ రోజు, ఈ క్షణాన ఎలా ఉన్నావో కదా...! నిన్ను నీ జ్ఞాపకాలను తలచుకుంటూ, నీ వదిలి వెళ్లిన ఏకాంతంలో... నేను...!!
 
          నువ్వు వెళ్లేటప్పుడు ఎలా ఉందో నా గది ఇప్పటికీ అలానే ఉంది. నామదిలా...  అన్ని వస్తువులు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీవు రావని, కుదరదని తెలిసినా...!? వెర్రిగా, పిచ్చిగా...! ఏ వస్తువును ముట్టుకోబోయినా వాటి మీద నీ వేలి ముద్రలు నాకు నీ స్పర్శనే గుర్తుకు తెస్తున్నాయి. నీవు వేసుకున్న షర్టు, ఇప్పటికీ హ్యాంగర్ కు వేళాడుతూనే ఉంది. నేను మాత్రం దానిని చూసినప్పుడల్లా నీతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి హ్యాంగ్ అవుతూనే ఉన్నాను.
 
           అవును... నిన్ను నువ్వు భరించలేనంతాగా నన్ను ఇష్టపడ్డావు. ప్రేమకు పిచ్చి భాషలెన్నో చెప్పావు. ప్రేమన్నది నిర్వచనం ఇవ్వలేనిదేమో...! ప్రేమలో మునిగి ఉన్నప్పుడు వాళ్ల వాళ్ల హృదయ సౌందర్యాన్ని కొలవడానికి ఏదైనా సాధనం ఉంటే ఎంత బావుణ్ణు...! అప్పుడు ప్రేమకు కచ్చితమైన రంగు, రుచి ఇవ్వొచ్చు. అయినా నా పిచ్చి కాని ప్రేమను కొలవటం ఏంటి.? అదొక ఆంతరంగిక చలనం. ఒక స్పార్క్. గుండెలో కదిలే సుతిమెత్తని సవ్వడి. మధురమైన బాధ. ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు. అవన్నీ నేను నీ ప్రేమలో పొందాను.
 
       'ప్రేమంటేనే శాస్వత విరహం. ప్రేమంటేనే సుదీర్ఘ నరకం' అన్నాడు ఓ కవి. నిజమే...! అర్థమవుతోంది. ఎన్ని కలలు, ఎన్ని కళలు, ఎన్ని కల్పనలు, ఎన్ని చేతలు, ఎన్ని రాతలు... అన్నీ అన్నీ ఒక్క ఎడబాటుతో జ్ఞాపకాల్యయాయి. చేదు జ్ఞాపకాలయ్యాయి. ఇంతకీ ఎలా ఉన్నావు.? ఈ క్షణంలో ఏలా ఉన్నావు.? చివరకు పడుకునే ముందైనా నేను గుర్తుకు వస్తానా...? నా అభిమానం కాకపోతే..! నేను గుర్తు పెట్టుకున్నానని, నీవు గుర్తు పెట్టుకోవాలను కోవడం... ప్చ్..
 
     ప్రేమలో ఇంత తీక్షణత, కాంక్ష, వేదన ఎలా ఉన్నాయో...! ఎప్పుడయినా కనపడక పోతావా... అని చిగురించే ఆశ. ఒకవేళ కనపడితే నీతో ఏం మాట్లాడాలి.? ఎలా మాట్లాడాలి.? తొలి పదాన్ని ఎలా ఉచ్ఛరించాలి.? నీ రూపం ఎలా ఉంది?. నీ మనసు ఎలా ఉంది?. ముఖ్యంగా అంత తేనేను దాచిని నీ అధరాలు ఎలా ఉన్నాయో...! నువ్విచ్చిన తొలి ముద్దు తీయదనం నా పెదాల మీద ఇంకా ఆరలేదు. ఇప్పటికీ అలానే కదలాడుతోంది.
 
          ఇన్ని ఆలోచనలు చేస్తున్నాను గానీ, నువ్వసలు కనపడాతావా...? ఏ దేవలోకంలో గంధర్వ కన్యగా మారి ఉంటావో కదా...! ఒక వేళ కలలో కనపడినా ఈ ప్రేమ బుజ్జి బిచ్చగాడితో మాట్లాడతావా...? అయినా స్త్రీకి, స్త్రీ ప్రేమకు లొంగే పురుషుడంటే... స్త్రీయే సర్వస్వంగా తపించే పురుషుడంటే స్త్రీకి లోకువే కదా...!? నీ ప్రేమ కోసం ఎంత ఆరాటపడ్డాను. ఎన్ని రోజులో మూగగా రోదించాను. కరుణించావు. కురిపించావు. వర్షించావు. చివరకు దూరమయ్యావు. అంతా ఓ చిత్రికలా...! అవన్నీ తలచుకుంటుంటే ఆ క్షణాలలో... నేను పొందిన ఆనందం ఎంత గొప్పదో ఇప్పుడు తెలిసి వస్తోంది. నిజంగా ఆరాధనలో ఉండే ఉషస్సు నా హృదయాన్ని వెలిగించిన రోజులవి. దేవతకోసం నే ఎత్తిన మంగళ హారతిలాంటివి.
 
           ఈ ప్రపంచం నిండా ప్రేమికులే ఉన్నారు. కానీ భయం. ప్రతి స్త్రీ, పురుషుడు తప్పక ఎవరో ఒకర్ని ఏదో ఒక క్షణం తప్పక ఇష్టపడి ఉంటారు. వారికోసం ఒక్క నిద్రలేని రాత్రినైనా గడిపి ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా ఆ మధుర ఘడియల్ని తప్పక గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ సమాజపు బురదలో పడి ఆంతరంగిక లోతుల్ని దాచేసుకుంటుంటారు. మనిషి సంకెళ్లు విధించొచ్చుగానీ, మనసుకు సంకెళ్లు విధించలేరు కదా...! అంతా ఓ విచిత్రమైన మనో చర్య. వారిని వారు మోసంతో నటించే నటనా ప్రక్రియ.. ఓహ్..!! ఏం ఈ జీవన సంతోషం.!
 
      రోజులన్నీ ఖాళీగా కదులుతున్నాయి. కఠినంగా నన్ను, నా జీవితాన్ని శాసిస్తున్నాయి. నీకు నిజం చెప్పనా...! నీవు దూరమైన రోజునుంచి ఇప్పటి వరకు నేను బతికిన క్షణం ఒక్కటీ లేదు. బతకడం అంటే ఒక పరిమళ భరితమైన ఆనందాన్ని, ఉవ్వెత్తున ఎగసే సౌందర్యాన్ని అనుభూతి చెందడం. కానీ ఈ మనుషులకు ప్రేమంటే తెలీక. బతకడం అంటే తెలీక... డబ్బు, ఆస్తి, హోదా అని బతికేస్తుంటారు. నవ్వు వస్తుంది కదూ...!!
 
           మళ్లా నేను నేనుగా బతకాలన్న కోరిక చచ్చిపోయింది. చిగురించని ఆశతో ఎలానో ఒకలా... బహుశా ఇలానే నేమో...
                                               లేకుండా ఉండనా...
                                   

Saturday, 21 June 2014

ఎదను తడిపిన పుట

 
                                             
 కాలం ఎప్పుడూ ఇంతే...! నా మనసులాగా ఎన్నో వింతలు, గమ్మత్తులు చేస్తుంది. చల్లని సాయంత్రాలు, శీతాకాలం నాటి వెచ్చని కౌగిళ్లు పంచిన వెన్నెల రాత్రులు వెళ్లిపోయాయి. వేసవి తాపాలు ఎక్కువయ్యాయి. అసలు, ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక 'శిశిరానికి చివరెందుక'ని ప్రేమికులు ప్రశ్నించారని ఎక్కడో యవ్వనపు తొలి రోజుల్లో చదివిన గుర్తు. కానీ కాలచక్రం ఆగదు. నీ జ్ఞాపకాలు చక్రం కింద నలుగుతున్న నా హృదయ సవ్వడిలా...!
 
       వేసవి అనగానే పచ్చటి మామిడి వాసనలు మదిని తాకుతాయి. మల్లెలు మొగ్గలై ఎదను పురికొల్పుతాయి. ఏ మధన మనోహరుడో, తన మనోహరికి బహుమతిగా ఇవ్వడానికి ఈ మల్లెలను కనిపెట్టి ఉంటాడు. అసలు సృష్టికర్త బ్రహ్మే ప్రేమికుల విరహాన్ని, తృప్తిని కవ్వించడానికి వీటిని భూమ్మీద పుట్టించి ఉంటాడు. శరీరం మొత్తాన్ని తెలియని మైకంతో కమ్మేసే ఆ సువాసనా పరిమళాన్నిఎంతమంది కవులు అనుభవాలతో గానం చేశారో...! అప్పుడే స్నానం చేసిన నీ కురల మధ్య నే దాక్కుని నీ చెవిలో రహస్యాన్ని విప్పుతున్నప్పుడు, కొబ్బరాకు సందుల్లోంచి చంద్రుడు వినటానికి ఎన్ని ప్రయత్నాలు చేసేవాడో కదా...! అయినా వేసవి రాత్రులు, మల్లెల పరవశాలు, వెన్నెల చినుకులు... ఇలా మన ప్రేమకు ఎన్ని కానుకుల్ని ప్రకృతి ప్రసాదించింది ఆ రోజుల్లో.
 
         గుర్తుందా... మిద్దెమీద మనిద్దరమే చుక్కలు లెక్కపెట్టాడానికి పోటీ పడి అసలసి పోయేవాళ్లం. చివరకు లెక్కలు కూడా మర్చిపోయేవాళ్లం. అలసి నీ ఒడిలో సేదతీరే నా శరీరాన్ని...! అయినా నీకేనా, ప్రతి స్త్రీకి అంత గొప్ప హృదయం ఉంటుందా...! బహుశా... స్త్రీ హృదయానికే సృష్టికర్త అంతటి బహుమానం ఇచ్చి ఉండాలి. నీ కొంగును నా కళ్లకు కప్పి, చంద్రుడ్ని మసగ్గా చూపిస్తూ ఆటలాడేదానివి. తెల్లటి నీ నడుము వొంపు చంద్రవంకతో పోటీ పడుతుంటే, నా చేతి వేళ్లు సరాగాలు పోయేవి. అప్పుడు భావావేశంలో ఏ షెల్లీనో, కీట్స్ నో గుర్తు చేస్తే...! ముఖం చిన్నబుచ్చుకునే దానివి. నిన్ను ఆటపట్టించడం నాకు బాగా సరదా. అప్పుడు నీ ముఖం బలే ఉంటుంది. ఎన్నో సౌందర్య రహస్యాల్ని నింపుకుని పురి విప్పిన నెమలిలా...! మన గిల్లికజ్జాలు చూడలేక చంద్రుడు కూడా మబ్బుల్లోకి వెల్లిపోయేవాడు.
 
          అవును, గుర్తుల ఎడారిలో ఒయాసిస్సులు పలకరించవు. ఎండమావులు మాత్రమే భ్రాంతిని కలిగిస్తాయి. నిన్న ఆఫీసు నుంచి వస్తున్నా...! బస్సులో నా ముందు సీట్లో ఓ అల్ట్రామోడ్రన్ అమ్మాయి మల్లెపూలతో కూర్చొంది. పచ్చని మెడపై తెల్లగా అవి నవ్వుతున్నాయి. ఆశగా వెక్కిరిస్తున్నాయి. ఆ అమ్మాయి పైటకు, జీన్స్ కు మధ్య వారధిలా అనిపించింది నాకు. డిగ్రీ చదివే రోజుల్లో హిస్టరీ లెక్చరర్ ప్రైవేటు క్లాసు తీసుకుని మరీ నోట్స్ చెప్తుంటే... ఉ. నా ముందు మల్లెల జడతో వచ్చి కూర్చొంది. ఇక నాబాధ ఎవరికి చెప్పుకోను. ఆ మత్తులో ఎన్ని తప్పులు నా నోట్స్ లో దొర్లాయో...! అనాలోచితంగా ఉ. జడ కదిలిస్తుంటే...! నా చిన్న ప్రాణం...! పునర్జన్మ మీద నాకు నమ్మకం లేకపోయినా...! ఏ హృదయగతపు పురావాసనలో నా నిండి ఉండాలి.
 
         ఇలా... వడపోతల మీద వడపోతలు చేసి మనసును మొద్దు బారిద్దామని ప్రయత్నం చేస్తుంటే...! అది మాత్రం మరీ సున్నితంగా, సుకుమారంగా తయారవుతుంది. ఈ మధ్య ఎక్కువసార్లు నాలోకి నేనే పరకాయ ప్రవేశం చేస్తున్నాను. నన్ను నేను మరీమరీ తొవ్వుకుంటున్నాను. అలా అయిన ప్రతి సారీ నువ్వే నాలోకి వచ్చేస్తున్నావు. కావాలనిపిస్తావు. చూడాలనిపిస్తావు. నీతోనే ఉండాలనిపిస్తావు. ఆరాధన, ఆర్తి, అభిమానం, మమకారం, ప్రేమ, స్నేహం, విరహం, తపన, తమకం... ఇలా ఆ భావనకు ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. అసలు భాషకందనిది ప్రేమ. దానికి పేరు పెట్టి దాని శక్తిని, ఉధృతిని, కాంక్షని తగ్గిస్తున్నారు ఈ పిచ్చి జనం. నిజమైన ప్రేమ ఈ కపట మనుషులకు దొరికితేనా...! అది వీళ్లని కాల్చి చంపుుతంటే తట్టుకోేగలారా...! నిజం చెప్పు. కాల్చి పుటం పెట్టదూ, మృధుత్వాన్ని దహించే అమృతం కదా అది. ఈ పిచ్చి వేదాంతులు పెట్టుకున్న అద్వైత భావన కన్నా గొప్పది. అసలు ప్రేమను తెలియజేయడానికి మాటలు, పదాలు, వాక్యాలు, చివరకు భాషే సరిపోదు. 
 
          ఎక్కడో చదివిన గుర్తు. ఓ ప్రేమికుడు తన ప్రేమను ప్రియురాలికి ఎలా చెప్పాలో తెలియక, ప్రేమదేవత గూర్చి కఠోర తపస్సు చేశాడట. చివరకు దేవత ప్రత్యేక్షమైతే తన బాధ చెప్పుకున్నాడట. అప్పుడు ప్రేమదేవత 'వెళ్లు అధరాల మృధుత్వాన్ని అధరాలే గ్రహిస్తాయి. నాలుక రుచిని నాలుకే స్వీకరిస్తుంది. దంతాలు సైతం తమ శక్తిన ధారాదత్తం చేస్తాయి. నీలో నుంచి అమూల్యమైన మాధుర్యం నేరుగా ఆమె లోకి ప్రవేశిస్తుంది.' అని చెప్పిందట. సరిగా అప్పుడే ఈ భూలోకంలో ముద్దు అనేది పురుడు పోసుకుందట. ఎంత అందమైన ఊహ...! కాదు వాస్తవమే....! నీవు నా దగ్గర ఉంటే ఈ వెచ్చని వేసవి రాత్రిని మల్లెలతో అభిషేకింతును కదా...!
         నీకో విషయం చెప్పనా...! నీతో ఇన్ని ప్రేమ జ్ఞాపకాలను పంచుకుంటున్నానా...! మల్లెపువ్వుల్లాంటి అన్నం నల్ల గులాబీలా తయారైంది. నా చీకటి జీవితాన్ని గుర్తుకు తెస్తూ...
                                
                                 సెలవు ఇవ్వని నా మనసుతో...
                                                   నీ          

Friday, 20 June 2014

ఎప్పటికీ నీకై ...



ఈ మధ్య వేదించే ప్రశ్నలు పెరిగాయి. అన్నిటికీ ఒకటే కారణం. అసలు జీవించండం అంటే ఏమిటి? పుట్టడం, ఈ మార్కులతో జ్ఞానాన్ని కొలిచే చదువులను డబ్బుతో కొని, వ్యాపారంగా చదువుకోవడం. కట్నంతో... పెళ్లి పేరుతో ఓ అమ్మాయిని కొనుక్కోవడం. మేం ప్రేమగా జీవిస్తున్నాం... అని నటించడం. అసలు మనస్ఫూర్తిగా స్త్రీని ప్రేమించగలిగినప్పుడు ధనం అనేది ఎందుకు రిలేషన్స్ ను నడిపిస్తుంది. పెళ్లి కాగానే పిల్లలు. వారిని పెంచి పెద్దజేయడం. వద్దనుకున్నా వదలని ముసలితనం. ఆ పై చావు. ఇదంతా బతుకు నాటకం అని వాగ్గేయకారులు ఎప్పుడో గానం చేశారు. కానీ ఈ వెదవ బతుకుకోసం, బతకడం కోసం... ఎన్ని తంటాలు?. ఎన్ని కష్టాలు.? ఎన్ని కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ద్వేషాలు, దోచుకోడాలు... ధనం అనే పిచాచికై వెంపర్లాటలు. సుఖం సుఖం అని మనసుకు సంబంధం లేని వాటిని సమాజంలో ఉన్నతం కోసం కొనుక్కోవడం. ఇదంతా ఆలోచిస్తే మనసు వేడెక్కుతుంది. బతుకు బరువు అవుతోంది. ఇదేనా జీవితం అనివిస్తుంది. ఇలా బతకడం కోసం, గొప్పలు కోసం, ధనం కోసం, కీర్తికోసం పాకులాడడం చూస్తుంటే నవ్వు వస్తుంది. ఈ జీవితానికి అసలు అర్థం ఉందా? అనే ప్రశ్న వెర్రితలలతో నాలో నర్తిస్తుంది. 

అసలు మనషులకు ఏమి కావాలి...? ప్రేమ... ఒకరికి ఒకరు... అనే విడదీయలేని అదిభౌతిక సంబంధం. స్త్రీ, పురుషుల మధ్య ఉండాల్సిన సౌందర్యాత్మక ఆరాధన. గుండెల్ని మండించే ప్రేమ. నీకోసం ఈ ప్రపంచాన్ని ధిక్కరించే మరో హృదయ సౌకుమార్యం. కానీ స్టేటస్ పేరుతో తమను తాము, తమ ఆత్మల్ని తాము ఉరితీసుకుంటున్న ఈ జనాల్ని చూస్తుంటే భయం వేస్తుంది. మొన్న మా బంధువు జ. నిశ్చితార్థానికి వెళ్లాను. నాకు ఆ అమ్మాయితో చిన్నప్పటి నుంచి చనువు ఎక్కువే... నా పిచ్చి ఆలోచనల్లో ఏవో కొన్ని నచ్చి ఉంటాయి. నీకు పెళ్లి కొడుకు నచ్చాడా...? అని అడిగాను. వాళ్లు ఆడోళ్లని బయటకు పంపరు. మర్యాదగా ఉంటారు. టీవీ, ప్రిజ్... ఇంట్లో అన్ని సామాన్లూ ఉన్నాయి. నన్ను బాగా చూసుకుంటాడు. ఆస్తి బాగా ఉంది. అని సమాధానం చెప్పింది. నిన్ను బాగా చూసుకోవడం అంటే...? నీవు ఏం చెప్పినా అలానే నడుచుకోవడం. నీకు అవసరమైన వస్తువులు కొనివ్వడం. ఇంతేనా అన్నాను. అవును... అంతే కదా కావాల్సింది. పైగా మూడు లక్షలు కట్నం అంది. 

ఏం చెప్పాలో అర్థం కాలేదు. మూడు లక్షలతో కొనుక్కునే సుఖం. మనసుతో సంబంధం లేని వస్తువులతో ఆనందాన్ని తూచే ప్రేమలు. ఒకరికి ఒకరు లొంగి ఉండే మనస్తత్వాలు... ఇవే కదా నాకు మొదటిన నుంచీ పడనవి. ఇంట్లో నుంచి బైటకు పంపకుండా స్త్రీ స్వేచ్ఛను హరించడం. పంపరు అంటే... బైటకు వెళ్తే అనుమానమా...? లేక అతని కంటే ఎక్కువ స్థాయికి ఎదుగుతుంది అన్న ఈర్ష్యా...? ఏమో... ! ఇన్ని వాస్తవమైన అనుమానాలు నా పాడు బుర్రకి. చలం ఎక్కడో చెప్పినట్లు గుర్తు... చదువుకున్న స్త్రీ సోకులకు, ఉద్యోగాలకు, పై అధికారులకు, వినిమయ వస్తువులకు బానిస అవుతోంది అని. అవును నిజమే కదా...! తెలియకుండానే పురుషాధిపత్యం అంటూ పురుషునితో సమానం అంటూ.., వారిని అధిగమించాలి అంటూ.., వారిని వాళ్లు కోల్పోతున్నారు. అందం పేరిట శరీరాన్ని సరుకు చేసి, మనసుతో బంధాన్ని తెంచేసుకుంటున్నారు. మరి వీరిలో ప్రేమించే గుణాన్ని ఎక్కడ వెతకాలి.? ఒకవేళ నిజమైన ప్రేమకాంక్ష వీరిలో జొరబడితే తట్టుకోలేరు. అయినా ప్రేమను ప్రేమగా తీసుకోడానికి వీరి మనసులో ప్లేసు కూడా లేదేమో...! నాకోసం నీచేయిని కోసుకుని నీవు ఎప్పుడూ నా చేయి మీద గుర్తుగా ఉన్నావు. అన్న నీ మాటలని వీళ్లకు చెప్పినా అర్థంకాదు. శాడిజం అంటారేమో...!           

రెండు రోజుల క్రింత ర..కు ఫోన్ చేశాను. ముందే చెప్పాను కదా... స్త్రీల పరిచయాలకు పూర్తి దూరంగా ఉంటున్నానని. కానీ మనసు ఎందుకో చేయాలనిపించింది. శి.ని పెళ్లి చేసుకుందట. ఎన్ని చాడీలు చెప్పింది. రాత్రిళ్లు కూడా వేరే వాళ్లతో తిరుగుతున్నాడని ఎంత గగ్గోలు పెట్టేది. ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నాడని ఎంత బాధపడేది. వాళ్ల ఇంట్లో ఒప్పుకోరని ఎన్నెన్ని మాటలు చెప్పింది. నేను ఎన్ని సార్లు నచ్చజెప్పాను, ఒదార్చాను. నీకు శి. తగినవాడు కాదని బతిమిలాడాను.. కానీ తప్పో ఒప్పో జరిగిపోయింది. అతడినే చేసుకుంటాను అని తెల్లటి ముఖాన్ని బాధతో ఎర్రగా మాడ్చుకునేది. పైగా 'నేను అతడిని ప్రేమించడానికి నీవు, నీ మాటలే కారణం' అని ఎత్తిపొడిచేది. నేనేం చెయ్యను. మనసును సున్నితంగా ఉంచుకోమనడం, స్వఛ్చంగా ప్రేమను పంచేలా మనిషి జీవించాలి అని చెప్పడం నా తప్పా...! 'అసలు నీ మాటలే  అంత...! ఎవరైనా అంతే...' అని స. వాళ్ల మరదలు అన్నప్పుడు... కాదని చెప్పలేక పోయాను. బహుశా దాచుకోవడం, సమాజంలో అందరిలా నటిండం చేతగాని నా మనసే నాకు ఆ మాటల్ని బహుమతిగా ఇచ్చిందేమో...! అసలు ప్రేమించడమంటే దహించుకపోవడం అని వీళ్ళకు తెలీదు. ఓ సారి ర. ఏమన్నదో తెలుసా... 'శి. వల్లే కాదు, నీ దగ్గర కూడా నీవు చెప్పిన ప్రేమను నే పొందలేదు' అంది. ఎలా పొందుతుంది. నన్ను ఆ దృష్టితో చూడకుండానే... అసలు ప్రేమ విశ్వమానవత్వం అని తెలియకుండానే... మనసులో స్వచ్ఛత లేకుండానే... 

నీవు భౌతికంగా నాదగ్గరలేని రోజుల్లో... ఓ రోజు ఉదయాన్నే 5గంటలకు లేచి డ్యూటీకి వెళ్తే... 9 గంటలకు ఫోన్ లో 'ఒక్కదాన్ని రూమ్ లో ఒంటరిగా వదిలేలి వెళ్లావే...' అని అడిగావు. ఆత్మల ఐక్యంతో నిండిన నిజమైన ప్రేమ భౌతికంగా దూరంగా ఉన్నా మనసులు కలిసే ఉంటాయి. అని రుజువైన రోజు అది. అలాంటి మన జీవితాల్లో ఎన్ని... ఎన్నెన్నో...
        
గుర్తులు, ఇంద్రధనుస్సులోని రంగుల్లా మెరుస్తూనే ఉన్నాయి. కానీ తర్వాత ప్రకృతి సహజంగా వాన వచ్చి చెరిపేస్తుంది. మీ నాన్నను ధిక్కరించిన రోజులు, నాలో ఏకమై నిద్రనుకూడా దూరంగా  తరిమేసిన గడియలు... వానలో తడిసి ముద్దై... విచ్చిన గులాబీల్లా నవ్వుకుని తమకంతో దగ్గరైన క్షణాలు... ప్రేమలు... ప్రేమ.. ప్రే. 

ప్రేమంటే సినిమాలు, బైక్ పై రైడింగులు, పబ్ లో తాగటాలు, డిస్కోథెక్ లు, షాపింగులు... అంటూ సహజమైన ప్రకృతికి దూరమవుతూ ప్రేమికుడు, ప్రియురాలు డబ్బులో ప్రేమను వెతుక్కుంటున్నారు. సంతోషానికి, సుఖానికి తేడాని గుర్తించలేక పోతున్నారు. అవసరానికి, కోరికకు మధ్య భేదాన్ని మర్చిపోతున్నారు. ప్రేమ ఓ సహజాతం. సహజమైన మానసిక, శారీరక క్రియ. ఓ నూతనోత్తేజం. తపించే హృదయరాగం. దానిని బిజినెస్ చేస్తే... ఏమో... ఏమో... నిన్నంతా నీవు కొనిచ్చిన చొక్కానే ... నా శరీరాన్ని బంధించి ఉంది. నీ చేతుల్లో చిక్కి అలసి సేదతీరిన నా దేహంలా... నీ హృదయకాంతిని నాలోకి నింపుతూనే... ఈ మానసిక క్షోభ నుంచి బయటపడటానికి... మాత్రమే... ఈ నాలుగు అక్షరాలు... నీవు లేని ప్రంపంచాన్ని దూరంగా నెట్టివేస్తూ... ఎప్పటికీ నాలోకిన నేను ఆత్మావలోకనం చేసుకుంటూనే...
                                                           
-ఎప్పటికీ
నీ